చర్చలే పరిష్కార మార్గం
విద్యార్థుల ఆందోళనలపై జార్ఖండ్
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్
రాంచీ : యువత, విద్యార్థులను సొంత బిడ్డలుగా భావిస్తామని, అలాంటి వాళ్లు వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ ఆందోళనలు చేపడితే వారిపై లాఠీలు, తూటాలు, పెల్లెట్ గన్నులు ఉపయోగిస్తున్నారని, ఇది దారుణమని పరోక్షంగా బీజేపీ పాలకుల తీరును జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఎండగట్టారు. తమ మార్గం అలాంటి హింసామార్గం కానేకాదని స్పష్టం చేశారు. జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో (జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ) అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు, యువత చేస్తున్న ఆందోళనలను ఆయన ప్రస్తావిస్తూ ఈ విషయంలో విద్యార్థులతో, యువతతో చర్చలు ద్వారానే పరిష్కారాలు కనుగొంటామని తెలిపారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను అణిచేసేందుకు తమ ప్రభుత్వం ఎలాంటి హింసాత్మక చర్యలు చేపట్టబోదని స్పష్టం చేశారు. ఆదివారం నాడు జార్ఖండ్‌లో ఆదివాసీ మహోత్సవ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ విదార్థులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యా వ్యవస్థ, పరీక్షలు, అలాగే నియామక ప్రక్రియలను మరింత మెరుగపర్చేందుకు, పటిష్టపర్చేందుకు విద్యార్థులు, యువత నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థుల సమస్య తన సమస్యేనని, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యల్ని లాఠీలు, బుల్లెట్లతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హేమంత్ సోరెన్ అన్నారు. విద్యార్థుల ఆందోళనల్ని రాజకీయ కోణంలో చూడొద్దని, రాజకీయ ప్రయోజనాల కోసం యువతను తప్పుదోవ పట్టించొద్దని రాజకీయ పార్టీల్ని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని స్వార్థ ప్రయోజన శక్తులు ప్రయత్నిస్తున్నాయని హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. ప్రభుత్వం బలపడటాన్ని జీర్ణించుకోలేని కొందరు అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘లాఠీ- తుపాకులు కాదు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం’ అని ఆయన పునరుద్ఘాటించారు. ఆయుధాలనేవి దేశ సరిహద్దుల్లోని శత్రువుల కోసం ఉపయోగించాల్సినవని, మన దేశంలో మన ప్రజలపై బలప్రయోగం చేయడం ద్వారా సమస్యలు ఎన్నటికీ పరిష్కారం కావని హితవు పలికారు.
విద్యార్థులతో ప్రభుత్వం చర్చలు
ఈ నేపథ్యంలో రాంచీలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో ప్రభుత్వం, జేపీఎస్‌సీ, .జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థుల ప్రతినిధుల మధ్య మరోసారి చర్చలు జరిగాయి. ఎనిమిది మంది ప్రతినిధులు మంత్రులు దీపికా పాండే సింగ్, సుదివ్య కుమార్, చామ్రా లిండా, సంజయ్ యాదవ్‌తో సమావేశమయ్యారు. విద్యార్థులతో చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ వ్యాఖ్యానించారు. జేఎస్‌ఎస్‌సీ – సీజేఎల్ పరీక్షకు సంబంధించిన అవకతవకలపై రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. నిందితులపై వేగంగా చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్టు కూడా మంత్రి తెలిపారు. నియామక పరీక్షల్లో సంస్కరణలకు సంబంధించి సూచనల కోసం ఐఐటీ, ఐఐఎం, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన నిపుణులతో మరో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించారు. ఇప్పుడిక ఆందోళనలు విరమించాలా లేదా అన్నది విద్యార్థులే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అయితే కేవలం హామీలతోనే సరిపెట్టకుండా, తమ డిమాండ్ల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి ప్రతినిధులు కోరారు. ‘పోస్ట్ డేటెడ్ చెక్’ వంటి భవిష్యత్తు హామీలు తమకొద్దని, స్పష్టమైన పరిష్కారం ఎప్పుడు వస్తుందో కావాలని పేర్కొన్నారు. జేపీఎస్‌సీ పరీక్ష రద్దు డిమాండ్ నెరవేరిందని, అయితే సీబీఐ దర్యాప్తు జరపాలన్న తమ డిమాండ్‌పై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని అన్నారు. ఈ నెల 10న జార్ఖండ్ అసెంబ్లీ దిశగా మార్చ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. సీబీఐ దర్యాప్తు ప్రకటించే వరకు రాజీకి సిద్ధంగా లేమని తెలిపారు.
16వ రోజుకు
చేరిన నిరసనలు
జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన నిరసనలు ఆదివారంతో 16 వ రోజుకు చేరాయి. విద్యార్థులు రాత్రింబవళ్లు ఆందోళనలు, నిరవధిక ధర్నా కొనసాగిస్తున్నారు. ఆరుగురు విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. జులై 5న జేపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈ ఆందోళనలు ప్రారం భమయ్యాయి. నియామక ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు లేదా రిటైర్డ్ హైకోర్ట్ న్యాయ మూర్తులతో కమిటీ ఏర్పాటు చేయించి స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. జేపీఎస్‌సీ పరీక్షను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
సొంత బిడ్డలపై లాఠీలు, తూటాలా?
- Advertisement -
- Advertisement -



