Monday, August 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఉచితం ధర్మం కాదు

ఉచితం ధర్మం కాదు

- Advertisement -

అవి పేదల జీవితాల్లో మార్పు తెచ్చేవే..
పాలకుల కార్పొరేట్‌ విధాన నిర్ణయాల ఫలితమే ప్రభుత్వ ఉచిత పథకాలు
ధరల నియంత్రణలో ప్రభుత్వాల వైఫల్యం
సమాజంలో తొలగిపోని అసమానతలు ఉచితాలు కోటీశ్వరులకు వర్తింపజేయడంపైనే ప్రజల్లో వ్యతిరేకత

‘ప్రభుత్వాలు అతి ఉచితాలను ప్రజలకు ఇస్తున్నాయంటూ ఇటీవల న్యాయస్థానం కామెంట్‌ చేసింది. సంపన్నులకు కూడా ప్రభుత్వ రాయితీలు ఇస్తుంటే ‘కుబేరుడు’ కూడా పనిచేయడం మానేస్తాడంటూ ఘాటుగానే కామెంట్‌ ‌చేసింది. దీనిపై సోషల్‌ ‌మీడియా వేదికగా అనేక మీమ్స్‌, ప్రచారాలు జరుగుతున్నాయి. మోడీ భక్తులు దీన్ని అవకాశంగా తీసుకొని, పేదలను చులకన చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వాలు ఉత్తిపుణ్యానికి సబ్సిడీలు, ఉచిత పథకాలు అమలు చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి ‘ఓట్‌‌బ్యాంక్‌’ కోసం అనీ విశ్లేషణలు చేస్తున్నారు. అలాంటి వారికి అర్థంకాని అంశం ఏంటంటే నిత్యవసర వస్తువులు మొదలు వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు ఆకాశమంత ఎత్తు పెరగడానికి కారకులు ఎవరు స్పృహ లేకపోవడమే. పాలకుల అర్థిక విధానాలు పేదల జీవితాలను అభివృద్ధిపథంలో నడిపేలా ఉంటే, ఈ సబ్సిడీలు, ఉచితాల అవసరం ఏంటి… కంపెనీలు, కార్పొరేట్లకు లాభలు దోచిపెట్టేందుకు వారికి అనుకూలమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది ఎవరు? అన్నీ బాగుంటే ఆ మధ్య ఢిల్లీ రైతాంగ పోరాటం, ఇటీవలి కాక్రోచ్‌ ‌జనతాపార్టీ పార్లమెంటు ముట్టడి ఘటనలు ఎందుకు జరిగాయో పాలకులే కదా సమాధానాలు చెప్పాల్సింది.

బొల్లె జగదీశ్వర్‌
​దేశానికి స్వాతంత్య్రం వచ్చి78 ఏండ్లు గడిచినా పేదరికం ఇంకా ఉన్నది. దేశంలో అసమానతలు తొలగిపోలేదు. దళితులు, గిరిజనులు సామాజిక వివక్షకు గురవుతూనే ఉన్నారు. దేశంలో దాదాపు 34.2 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో సుమారు 20,58,216 మంది అతి దారిద్ర్యంలో ఉన్నారు. 2,73,02,865 (78 శాతం)
మంది ప్రజలు ఏడాదికి రూ.లక్షలోపు ఆదాయాన్ని మాత్రమే సంపాదిస్తున్నారు. పేదరికంలో ఉన్న ప్రజలు ఆదుకోవడానికి, అసమానతలు తగ్గించడానికి రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇస్తాయి. వాటి ఆధారంగా ప్రజలు రాజకీయ పార్టీలను ఆదరిస్తారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల అమలు కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడతాయి. అయితే పరిమితికి మించి అమలు చేస్తున్న ఉచిత పథకాలతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలుంటే 1.03 కుటుంబాలకు ఉచిత పథకాలు అందుతున్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఉచిత పథకాలను అమలు చేస్తూ పోతే కుబేరుడైనా పనికి ఆహారం వంటి పథకం కింద కూలి పనికి వెళ్తాడని చెప్పింది. కోటీశ్వరులకు రైతుభరోసా ఇవ్వడమేంటని ప్రశ్నించింది. ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఉచిత పథకాలు పేద ప్రజల జీవితాలకు కొంతమేర మేలు చేస్తున్నాయి. రోజువారీ జీవనం సాగించేందుకు ఉపశమనం కలిగిస్తున్నాయని అనడంలో అతిశయోక్తి లేదు. ఆ పథకాల ద్వారా వారి జీవన ప్రమాణాల్లో మెరుగుదల కనిపిస్తున్నది. ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల ద్వారా వారి ఆత్మగౌరవం పెరుగుతున్నది. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుభరోసా నిధులతో అప్పుల భారం లేకుండా వ్యవసాయం కొనసాగించే పరిస్థితి ఉన్నది. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్‌, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఇలా ఏ పథకమైనా పేద ప్రజలకు సామాజిక భద్రతను, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తున్నది. ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. అందుకే భారం పడినా వాటిని అమలు చేసేందుకే ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నాయి.

అనర్హుల పేరుతో పథకాలపై వ్యతిరేకత
కోటీశ్వరులకు రైతుబంధు ఇవ్వడం, అనర్హులకు సంక్షేమ పథకాలను వర్తింపజేయడం వంటి కారణాలతో ఉచిత పథకాలపైనే వ్యతిరేకత రావడం ఆందోళన కలిగించే అంశం. పాలకులు, అధికారులు సంక్షేమ పథకాలను అర్హులకే అందించేలా ప్రణాళిక రూపొందించాలి. స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాలి. అనర్హుల పేరుతో అర్హులైన పేద ప్రజలకు సంక్షేమ పథకాలను దూరం చేయాలనే ఆలోచన సరైంది కాదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో అమలైన రైతుబంధు అర ఎకరం ఉన్నోడికి వచ్చింది. అదే సమయంలో భూస్వాములకూ వర్తింపజేసింది. ఎక్కువ ఎకరాలున్న భూస్వాములకు రైతుబంధు అవసరమా?అన్న చర్చ జరిగింది. ఈ లోపాన్ని బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సరిదిద్దుకోలేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. బీఆర్‌ఎస్‌ ఓడిపోవడానికి అది కూడా ఓ కారణమైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ తరహాలో తెల్ల రేషన్‌ ‌కార్డు ఉన్న వారికి లేదంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) కుటుంబాలకే సంక్షేమ పథకాలను అమలు చేయాలన్న అభిప్రాయమూ వినిపిస్తున్నది.

కానీ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బీపీఎల్‌ ‌కుటుంబాలతోపాటు ఆధార్‌ ‌కార్డు ఉన్న సంపన్నులు కూడా వినియోగించుకుంటున్నారు. అందులో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఈ పథకం అమలు పట్ల సమాజంలో వ్యతిరేకత ఉన్నది. ఇలా సంక్షేమ పథకాలు అనర్హులకు అమలు చేయడం వల్ల అర్హులపై ఆ ప్రభావం పడుతున్నది. ప్రభుత్వం ఆలోచించి అర్హులకే పథకాలను అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకోవైపు కార్పొరేట్‌ ‌సంస్థలకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు పన్ను రాయితీ ఇస్తున్నాయి. పెట్టుబడులను ఆకర్షించేందుకు అతితక్కువ ధరకు భూములను అప్పగించడంతోపాటు పలు మినహాయింపులను ఇస్తున్నాయి. పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలపైనే వ్యతిరేకత వస్తున్నది తప్ప కార్పొరేట్‌ ‌సంస్థలకు ఇచ్చే పన్ను రాయితీలపై చర్చ జరగకపోవడం గమనార్హం.

కేంద్రం సహకారం అంతంతే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు కేంద్రం నుంచి పన్నుల వాటా రూ.33,181 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.29,471.19 కోట్లు వచ్చాయి. కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ‌కూడా కీలకమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.24,166 కోట్లు వస్తాయని అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.22,782.50 కోట్లు వస్తాయని బడ్జెట్‌‌లో ప్రతిపాదించింది. కానీ రూ.10,422.98 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే రూ.12,359.52 కోట్లు ఇవ్వలేదు. తెలంగాణకు నిధుల మంజూరులో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని అర్థమవుతున్నది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ దిశగా మంత్రివర్గ ఉపసంఘం ఆలోచన చేస్తున్నది.​

ప్రజలపై ధరల ప్రభావం
ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం విపరీతంగా ఉంది. తాజాగా ఎఫ్‌ఎమ్‌‌సీజీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరల్ని మరోసారి పెంచుతామని ప్రకటించాయి. వాటిలో బ్రిటానియా 1.5 శాతం నుంచి రెండు శాతం వరకు, గోద్రెజ్‌ ఐదు శాతం, హెచ్‌‌యూఎల్‌, టాటా కన్సూమర్‌ ‌గూడ్స్‌, నెస్లే ‌వంటి సంస్థలు కూడా ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. మరి ఇలాంటి కంపెనీల చేతుల్లో ప్రజల అహార భద్రతను పెట్టింది మన పాలకులే కదా! వీటివల్ల సామాన్య వినియోగదారులపై పడే ఆర్థికభారం భారీగా ఉంది. మరి ఆ సామాన్యుల వేతనాలు, రోజువారీ కూలీల రేట్ల పెంపులో ప్రభుత్వాలు ఎలాంటి చొరవ చూపాయనేది కూడా ముఖ్యమైన అంశమే!

సంక్షేమ పథకాలకు రూ.1,45,591 కోట్లు
రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.1,45,591 కోట్లు కేటాయించింది. ఇందులో ఆరు గ్యారంటీల అమలు కోసమే రూ.50,713 కోట్లు ప్రతిపాదించింది. రైతుభరోసాకు రూ.18 వేల కోట్లు, చేయూతకు రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు రూ.5,500 కోట్లు, మహాలక్ష్మి కింద ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణానికి రూ.4,305 కోట్లు, వరి పంటకు బోనస్‌కు రూ.3,500 కోట్లు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు రూ.2,080 కోట్లు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీకి రూ.1,143 కోట్లు, మహాలక్ష్మి కింద గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌సబ్సిడీకి రూ.723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. విద్యుత్‌ ‌సబ్సిడీకి రూ.14 వేల కోట్లు, ఆహార సబ్సిడీకి రూ.మూడు వేల కోట్లు, కళ్యాణలక్ష్మి/షాదీముబారక్‌‌కు రూ.3,683 కోట్లు, డైట్‌ ‌చార్జీలకు రూ.2,170 కోట్లు, స్కాలర్‌‌షిప్‌‌లకు రూ.4,343 కోట్లు, రాజీవ్‌ ‌యువ వికాసానికి రూ.5,800 కోట్లు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ ‌గురుకులాలకు రూ.ఐదు వేల కోట్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు రూ.నాలుగు వేల కోట్లు ఇలా వివిధ పథకాల అమలు కోసం నిధులను కేటాయించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -