కళాకారులను గుర్తిస్తూ… హస్త కళలను బతికించాలి!

– టీటీడీ బోర్డు మెంబర్ గడ్డం సీతా రంజిత్ రెడ్డి
– హైదరాబాదులో తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్ హస్త కళల అంగడి ప్రారంభం

నవతెలంగాణ  హైదరాబాద్: ఎన్నో అపురూప కళలతో తయారైన హస్త కళాకృతులు తయారు చేసిన కళాకారులను గుర్తిస్తూ… ఆ కళలను బతికించాల్సిన అవసరం ఉందని టిటిడి బోర్డు మెంబర్ గడ్డం సీతా రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ అనునిత్యం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులను వారి కళలను కాపాడుకుంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాదులో తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అంగడి క్రాఫ్ట్స్ కార్యక్రమాన్ని తెలంగాణ హండ్లూమ్స్, టెక్స్టైల్స్ డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గడ్డం సీతా రంజిత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… నాణ్యత, పనితనం, ధరలు అన్ని చూసి వారి కళను ప్రోత్సహించే విధంగా తమ కౌన్సిల్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ ఎగ్జిబిషన్లో వారికి ఉచితంగా స్టాల్ ను పెట్టుకునేందుకు తాము అను విధాల సహకరిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల కళాకారులకు మరింత ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు.
భారతీయ సంస్కృతిలో చేనేత వస్ర్తాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని అన్నారు. వీటికి మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు క్రాఫ్ట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని చెప్పారు. నేత వస్ర్తాలంటే మనలో చాలా మందికి ఆసక్తి ఉంటుoదని వివరించారు. ఆ ఆసక్తిని తీర్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగ పడుతుందని అన్నారు. గత పదిహేనేళ్లుగా క్రాఫ్ట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ సభ్యురాలిగా కొనసాగుతున్నానని ఆమె పేర్కొన్నారు. పోచంపల్లి, గద్వాల, ఉప్పాడ, బెనారస్‌ వంటి తరాలనాటి వస్ర్తాలకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన అధునాతన డిజైన్లను ఒకే వేదికపైకి తెచ్చి విక్రయాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
నేటితరం కూడా చేనేత వస్ర్తాలను ధరించి మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్నదే తమ ఆకాంక్ష అంటూ వెల్లడించారు. కొవిడ్‌ సమయంలో ఎంతోమంది చేనేత కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేశామని సీతా రంజిత్ రెడ్డి ఉద్ఘాటించారు. కొయ్యబొమ్మల తయారీ వంటి హస్తకళలకు ఆదరణ కల్పించేందుకు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ రెండు రోజుల పాటు జరుగుతుందని… దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో సీసీటీ చైర్మన్ అనురాధ బిస్నొయ్, హేమలత కెంఖా తదితరులు పాల్గొన్నారు.

Spread the love