నవతెలంగాణ – చిత్తూరు: తిరుమల..మొదటి ఘాట్ రోడ్డులోని 38వ మలుపు వద్ద చిరుత సంచారం కలకలంరేపింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న వాహనదారులకు 38వ మలుపు వద్ద చిరుత కనపడింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కాగా శుక్రవారం తిరుమల నడక మార్గంలో ఘోరం చోటు చేసుకుంది. అలిపిరి కాలినడక మార్గంలో తల్లిదండ్రులతో కలసి వెళ్తున్న ఆరేళ్ల బాలికపై చిరుత దాడిచేసి హతమార్చింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలేనికి చెందిన ఆటో డ్రైవర్ దినేశ్‌కుమార్ కుటుంబ సభ్యులతో పాటు శుక్రవారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకున్నారు. ఐదేళ్ల కుమారుడు లిఖిత్ తలనీలాలు సమర్పించేందుకు భార్య శశికళ, కుమార్తె లక్షిత, మరో ఐదుగురు కలసి మధ్యాహ్నం 3గంటలకు అలిపిరి నుంచి తిరుమలకు నడక మొదలుపెట్టారు. రాత్రి 7.30గంటల సమయంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో వారి కుమార్తె లక్షిత(6) కన్పించకపోవడాన్ని గుర్తించారు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆ చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో దగ్గర్లోని సెక్యూరిటీ సిబ్బంది ద్వారా రాత్రి 10.30 గంటలకు పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐలు జగన్మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్ సిబ్బందితో అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం నడక మార్గానికి 150 అడుగుల దూరంలో ఓ కొండపై లక్షిత మృతదేహాన్ని గుర్తించారు. ఆమె మెడ, తలతో పాటు కుడికాలును చిరుత తినేసి పోయినట్టు గుర్తించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. శ్రీవారికి తమ కుమారుడి తలనీలాలు సమర్పించేందుకు వచ్చి కుమార్తెను కోల్పోయామంటూ లక్షిత తల్లి శశికళ రోదనలు రుయాస్పత్రిలో చూపరులను కంటితడి పెట్టించాయి. తొలుత చిన్నారిపై దాడి చేసింది ఎలుగుబంటి అని డీఎఫ్‌వో చెప్పుకొచ్చారు. అయితే పోస్టుమార్టం తరువాత చిరుత దాడేనని ప్రాథమికంగా తేల్చారు.