తెలంగాణలో బీజేపీకి షాక్

నవతెలంగాణ – వికారాబాద్: జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. రాజీనామా లేఖలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై ఆరోపణలు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువరించి తెలంగాణకు న్యాయం చేస్తాదని భావించి అనేకమంది ఉద్యమకారులు బీజేపీలో చేరి భంగపాటుకు గురవుతున్నారని విమర్శలు చేశారు. బీజేపీ, తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోందని ఆరోపణలు వస్తున్నాయని.. అందువల్లే తాను తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా గత కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు చంద్రశేఖర్ దూరంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత కిద్ది రోజులుగా చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. బీజేపీ నాయకత్వ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న ఆయన .. పార్టీ మారడం ఖాయమేనన్న సంకేతాలు ఇస్తున్నారు. 2021 జనవరి 18న వికారాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ సమక్షంలో చంద్రశేఖర్‌ బీజేపీలో చేరారు. అయితే, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్న ముఖ్య నేతల హామీ కార్యరూపం దాల్చకపోవడం, తన తరువాత పార్టీలో చేరిన వారిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడంతో చంద్రశేఖర్‌ మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యం ఉండేలా బాధ్యతలు అప్పగిస్తామని గతంలో బండి సంజయ్‌ హామీ ఇవ్వగా.. ఇప్పుడు ఆయన్నే పదవి నుంచి తప్పించడంతో చంద్రశేఖర్‌ ఆశలు నీరుగారిపోయాయి. పనిచేసే వారికి పార్టీలో విలువ ఇవ్వడం లేదన్న అభిప్రాయంతో తన దారి తాను చూసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. మరోవైపు, వికారాబాద్‌ నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవుల్లో కొనసాగిన చంద్రశేఖర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్‌లో చేరితే వ్యక్తిగత గౌరవంతో పాటు సరైన ప్రాధాన్యం ఇస్తామని వారు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, తనను నమ్ముకున్న నాయకులకు స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వాలని చంద్రశేఖర్‌ షరతు విధించినట్లు తెలిసింది. ఈ మేరకు అధిష్ఠానం నుంచి హామీ లభిస్తే కాంగ్రెస్‌లో చేరాలని చంద్రశేఖర్‌ భావిస్తున్నారు.

Spread the love