త్యాగాల వెనుక‌ ఆనందం ఉంటుంది

Happiness is behind sacrificesఅనుపమ ఉపాధ్యాయ… బ్యాడ్మింటన్‌ జూనియర్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నం.1 స్థానానికి చేరుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. 2023లో జాతీయ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఓర్లెన్‌ పోలిష్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ ఛాలెంజ్‌లో కూడా విజయం సాధించిన ఆమె తన శిక్షణ, సవాళ్లు, కలల గురించి ఏం చెబుతుందా తెలుసుకుందాం…
మీరు బ్యాడ్మింటన్‌లోకి ప్రవేశించడానికి కారణం?
2014 వేసవి సెలవల్లో మా అమ్మానాన్న నన్ను ఏదైనా క్రీడలో శిక్షణ తీసుకోమన్నారు. అప్పుడు బ్యాడ్మింటన్‌ ఆడాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే బయట విపరీతమైన వేడి ఇదైతే ఇండోర్‌ గేమ్‌ కాబట్టి దీన్ని ఎంపిక చేసుకున్నాను. ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కి వెళ్లాను. అక్కడ గంట సేపు నా శిక్షణ తర్వాత జట్లు ఆడటం చూస్తాను. షాట్‌ల కోసం చూస్తున్న ఆటగాళ్లను చూసి నేను ఆకర్షితురాలి నయ్యాను. నేనూ బ్యాడ్మింటన్‌ ఆడాలి, వృత్తిపరంగా దీన్నే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను.
మీ నిర్ణయానికి మీ తల్లిదండ్రుల స్పందన ఏమిటి?
నేనేం చేయాలనుకున్నా వాళ్లు చాలా సపోర్టివ్‌గా ఉంటారు. నా చదువు ఏమైపోతుందో అని కూడా వాళ్లు నన్ను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. వారే నా ప్రేరేపకులు, ఎల్లప్పుడూ నా వెనుక నిలుస్తారు. నేను ఘోరంగా ఓడిపోయిన రోజుల్లో నాతో పాటు నిలబడి ముందుకు సాగడానికి నన్ను ప్రేరేపిస్తారు. ఓడిపోయిన తర్వాత బలంగా తిరిగి రావడానికి అదే నా సానుకూల ప్రభావం.
శిక్షణ సమయంలో ఎదుర్కొన్న కొన్ని సవాళ్లను మాతో పంచుకోండి?
నేను ఎప్పుడూ చెప్పే విషయం ఏమిటంటే, నేను చాలా సన్నగా ఉంటాను. పైగా మేము శాకాహారులం. నా క్రీడా శిక్షణను తట్టుకుని, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి గుడ్లు, మాంసం ఇవ్వమని చాలా మంది మా నాన్నకు సలహా ఇచ్చారు. మొదట్లో అవి తినకుండానే నేను బాగా రాణించడమే కాకుండా జాతీయ ఛాంపియన్‌గా కూడా మారగలిగాను. అయితే నెమ్మదిగా నాకు అదనపు పోషకాహారం అవసరమని గ్రహించాను. అప్పటి వరకు మాంసం, గుడ్లు అంటే పెద్దగా ఇష్టం లేదు. క్రమంగా వాటిపై ఇష్టం పెంచుకుని చికెన్‌, మటన్‌, చేపల వైపు మళ్లాను. కేవలం తినడం మాత్రమే కాదు ప్రతి సెషన్‌ తర్వాత ఎంత తినాలో ప్లాన్‌ చేసుకున్నాను. కండలు పెంచడంపై దృష్టి కేంద్రీకరించాను. ఇలా పోషకాహార ప్రణాళిక సరైన స్థితికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను. అభిరుచికి అనుగుణంగా మారడం ఒక సవాలు మాత్రమే కాదు, ఒక ప్రక్రియ కూడా. అమ్మ నాకోసం నాన్‌వెజ్‌ వండడం నేర్చుకుంది. ఇప్పుడు ఎంతో ఇష్టంగా తింటున్నాను.
మొదటి ట్రోఫీ అందుకున్నపుడు ఎలా అనిపించింది?
నా మొదటి విజయం 2016లో అండర్‌-13 జాతీయ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకోవడం. సింగిల్స్‌, డబుల్స్‌ టోర్నీల్లో గెలిచాను. అండర్‌-13 సింగిల్స్‌, డబుల్స్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లు రెండింటినీ గెలిచినందున నన్ను లక్ష్య భయ్యా (ఛాంపియన్‌ లక్ష్య సేన్‌)తో పోల్చారు. అతను నాకు ఇష్టమైన ఆటగాళ్ళలో ఒకడు. దాంతో చాలా గర్వంగా భావించాను. గత ఏడాది కూడా సీనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌ అయ్యాను. సంతోషకరమైన క్షణాలలో అది ఒకటి. సైనా దీదీ (సైనా నెహ్వాల్‌), సింధు దీదీ (పివి సింధు) తర్వాత గెలిచిన అతి పిన్న వయస్కురాలిని నేనే.
క్రీడల వల్ల మీ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తున్నానని ఎప్పుడైనా అనుకున్నారా?
కచ్చితంగా అనిపించేది. మొదట్లో నేను జాతీయ ఛాంపియన్‌షిప్‌లకు సిద్ధమవుతున్నప్పుడు నాతో పాటు చదువుకుంటున్న వారంతా వారి సెలవులను ఆనందంగా గడుపుతుండేవారు. సరదాగా టూర్లకు వెళుతుంటే వారు తమ జీవితాన్ని ఆనందిస్తున్నారని నాకు అనిపించేది. అయితే ఇప్పుడే త్యాగం చేస్తే జీవితాంతం ఎంజారు చేయవచ్చని అప్పట్లో నా తల్లిదండ్రులు చెప్పారు. గెలిచిన తర్వాత వాళ్ళు చెప్పింది నిజమేనని గ్రహించాను. అందుకే నా తల్లిదండ్రులను మార్గదర్శకులుగా తీసుకుని నా లక్ష్యాన్ని చేరుకుంటాను.
మీ క్రీడా ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు..?
క్రమశిక్షణ కీలకం. మీరు మీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అందరూ మిమ్మల్ని చూస్తుంటారు. కాబట్టి సానుకూల దృక్పథం అవసరం. బయటకు వెళ్లేటప్పుడు కూడా క్రమశిక్షణను పాటించడం చాలా ముఖ్యం. దేశం నుండి బయటకు వెళ్లినప్పుడల్లా ఇష్టమైన ఆహారాన్ని మనతో తీసుకెళ్లాలని సింధు దీదీ నుండి నేను నేర్చుకున్నాను. కాబట్టి నేను ఎప్పుడూ స్నాక్స్‌తో ప్రయాణిస్తాను. అలాగే ఒత్తిడి నుండి బయటపడేందుకు మంచి నిద్ర ఎంత అవసరమో తెలుసుకున్నాను.జీవితంలో ఆటల్లో కూడా కొన్ని గెలుస్తావు, కొన్ని గెలవలేవు, కొన్ని ఓడిపోతావు అని మనందరికీ తెలుసు.
మీ ఇతర ఆసక్తులు..?
ఖాళీ సమయం దొరికినప్పుడు డ్యాన్స్‌ చేయడం చాలా ఇష్టం. హాస్టల్లో నా స్నేహితులతో కలిసి పాటలు పాడుతూ డ్యాన్స్‌ చేస్తుంటాను. అప్పుడప్పుడు మూగ చారేడ్స్‌ ఆడతాము. కార్డ్‌లు, యూఎన్‌ఓ లేదా సీక్వెన్స్‌ని ప్లే చేస్తాం. లూడో ఆడుతున్నప్పుడు ఒక ఆటగాడు మరొక ఆటగాడిని ఎందుకు అధిగమించాడు అనే దానిపై మా మధ్య భారీ పోరాటాలు ఉంటాయి. అది చాలా సరదాగా ఉంటుంది.
చదువు, శిక్షణ, ఆట ఎలా సమతుల్యం చేసుకున్నారు?
వారానికి ఐదు రోజులు శిక్షణ తీసుకోవడంతో చదువుకునే అవకాశం ఉండేది కాదు. ప్రతిరోజూ రెండు సెషన్‌లో శిక్షణ తీసుకుంటాను. అది కూడా చాలాఎక్కువగా ఉండేది. వారాంతాల్లో లేదా పరీక్షలకు ముందు పుస్తకాలను పట్టుకునేదాన్ని. కొంత కాలం తర్వాత రెగ్యులర్‌ స్కూల్‌ వదిలేసి ఓపెన్‌ స్కూల్‌ విధానంలో చదవడం మొదలుపెట్టాను. ఇది నాకు అవసరమైన సమయ సౌలభ్యాన్ని అందించింది.
మా పాఠకులకు మీ సందేశం?
నేను చెప్పదలుచుకున్నదేమిటంటే… అమ్మాయిలు ఏది చేయాలనుకుంటే అది చేయనివ్వండి. వారు కోరుకున్న రీతిలో వారి జీవితాలను ఆస్వాదించనివ్వండి. మీరు క్రీడను ఇష్టపడితే దానిని కొనసాగించండి. క్రీడలను ఆస్వాదించడం ప్రారంభించిన తర్వాత అది వేరే జీవితం. త్యాగాలు చేయాల్సి వస్తుంది కానీ విజయం సాధించిన తర్వాత జీవితమంతా ఆనందించడానికి మీకు అవకాశం ఉంది.

Spread the love