స్వరాలతో ప్ర‌యోగాలు ఆమె ప్ర‌త్యేకం

Experimenting with voices is her specialtyపక్షుల కిలకిల రావాలైనా.. పసిపాపల స్వరాలైనా.. అమ్మ పలికే లాలిపాటలైనా.. ఆమె గొంతులో సరాగాలై విరుబూస్తాయి. దుర్యోధన దుశ్శాసన దుర్వినీతిని ఎండగట్టినా… సిరిమల్లె పువ్వా..అంటూ హస్కి వాయిస్‌తో ప్రేక్షకులకు తీపి గాయాలను చేసినా ఆమెకే చెల్లింది. ఈ విధంగా స్వరాలతో చేయగలిగినన్ని ప్రయోగాలు చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. తన పాటలతో ప్రేక్షకుల మనసులను ‘నీలి మేఘాలలో’ తేలిపోయేలా చేశారు. తన సుస్వరాలతో ‘పగలే వెన్నెలను’ పూయిస్తారు. పాటల పూదోటలో తన గానామృతంతో మధురిమలు పంచిన మైనా. ‘గున్న మామిడి కొమ్మ’ మీది పలుకులతో వెండితెరకు వసంతాన్ని తీసుకొచ్చిన గాన కోకిల. ఇలా నవరసాలు ఆమె గొంతులో అలవోకగా జాలువారుతాయి. తేనెలూరే తన స్వరంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజెండరీ గాయకురాలు. ఆమే ప్రముఖ గాయని సిస్ట్లా జానకి. ఈరోజు ఆమె 86వ పుట్టిన రోజు సందర్భంగా మానవి స్పెషల్‌.
సంగీత ప్రియులు ‘జానకమ్మ’, ‘దక్షిణ భారతదేశపు నైటింగేల్‌ అంటూ పిలుచుకుంటారు. భారతీయ అత్యుత్తమ నేపథ్య గాయకులలో ఈమె ఒకరు. కన్నడ, మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, సంస్కృతం, ఒడియా, తుళు, ఉర్దూ, పంజాబీతో సహా 17 భాషల్లో సోలోలు, యుగళగీతాలు, కోరస్‌, టైటిల్‌ ట్రాక్‌లు, ఆల్బమ్‌లు, టీవీ, రేడియోలలో 48,000 పాటలు పాడు రికార్డ్‌ సృష్టించారు ఆమె. అంతేకాదు బడగా, బెంగాలీ, కొంకణి, ఆంగ్లం, జపనీస్‌, జర్మన్‌, సింహళం వంటి విదేశీ భాషల్లో కూడా పాటలు పాడారు. 1957లో తమిళ చిత్రం విధియిన్‌ విలయట్టుతో ప్రారంభమైన ఆమె కెరీర్‌ ఆరు దశాబ్దాలకు పైగా విస్తరించింది. నేటివిటీతో ఏ భాషలోనైనా వ్యక్తీకరణల రాణిగా ప్రశంసలు అందుకున్నారు. కర్ణాటకలో ‘గాన కోగిలే’, తెలుగు రాష్ట్రాల్లో ‘గాన కోకిల’, తమిళనాడులో ‘ఇసైక్కుయిల్‌’ అని ఆమెను పిలుస్తారు.
కూతురు సంగీతాభిలాష గమనించి
జానకి 1938 ఏప్రిల్‌ 23న ప్రస్తుత బాపట్ల జిల్లా, రేపల్లెలోని పాలపట్ల గ్రామంలో జన్మించారు. పుడుతూనే మాటల కంటే పాటలను నేర్చిందా అన్నట్టుగా ఉండేది ఈమె స్వరం. తండ్రి శ్రీరామమూర్తి ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు. చిన్నతనంలో కూతురు సంగీతాభిలాష గమనించి శ్రీ పైడిస్వామి దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. అప్పటి నుంచి తన పదోయేట వరకూ వివిధ సంగీత కచేరీల్లో పాడి పేరు తెచ్చుకున్నారు జానకి. 18 ఏండ్లు వచ్చే సరికి జాతీయ స్థాయిలో సంగీత పోటీలో పాల్గొనే అవకాశం వచ్చింది. 1957లో ఆల్‌ ఇండియా రేడియో నిర్వహించిన జాతీయ స్థాయి సంగీత పోటీలో ఉత్తమ గాయనిగా అవార్డు అందుకున్నారు. దీంతో ఆమె ప్రతిభ అందరికి తెలియాలని జానకి మామయ్య చెన్నై తీసుకెళ్లారు.
తొలి ఏడాదిలోనే వంద పాటలు
చెన్నైలో ఎ.వి.ఎం. ఆస్థాన సంగీత దర్శకుడు గోవర్థనం సంగీతంలో పరీక్ష పెట్టగా అందులో నెగ్గి అక్కడి స్టాఫ్‌ సింగర్‌గా ఎంపికయ్యారు. ఇక అప్పటి నుంచి ఆమె సినీ కెరీర్‌ మొదలైంది. జానకి గాయనిగా అడుగుపెట్టిన తొలి ఏడాదిలోనే దాదాపు ఆరు భాషల్లో 100కు పైగా పాటలు పాడడం విశేషం. తొలిపాట 1957 ఏప్రిల్‌ 4న రికార్డ్‌ అయ్యింది. తెలుగమ్మాయి తన తొలి పాట తమిళంలో పాడడం మరో విశేషం. మొదటిసారి అవకాశం వచ్చినపుడు విషాదగీతం అయితే సాధారణంగా ఎవరూ అంగీకరించరు. కానీ జానకి ఇలాంటి సెంటిమెంటు ఏది పట్టించుకోలేదు. గాయినిగా ఆమె ఏ భాషలో పాడిన తొలి గీతం విషాద గీతమే కావడం ఓ అద్భుతం.
విషాద గీతాలతో మొదలై…
తెలుగులో జానకి పాడిన తొలిపాట ‘నీ ఆశ.. అడయాస..’. పెండ్యాల సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ఎం.ఎల్‌.ఏ’ చిత్రంలో ఘంటసాలతో కలిసి ఈ పాటను జానకి ఆలపించారు. ఈ చిత్రంలో ‘ఇదేనండీ భాగ్య నగరము’ అనే పాట కూడా పాడారు. ఇలా ఏడుపు పాటలతో మొదలైన ఆమె పాటల ప్రయాణం.. ఆ తర్వాత మంచి హుషారైన గీతాలతో మేలిమలిపు తిరిగింది. అయితే తొలినాళ్లలో తమిళంలో వచ్చినంత పేరు తెలుగులో రాలేదు. గాయనిగా జానికికీ మంచి బ్రేక్‌ ఇచ్చిన చిత్రం ‘కొంజుం సలంగై’ అనే తమిళ చిత్రం. ఈ చిత్రంలో సన్నాయితో పోటీ పడి జానకి పాడిన పాట ఆమెకెంతో పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘మురిపించే మువ్వలు’గా డబ్బింగ్‌ చేశారు. ఈ మూవీలో వచ్చే ‘నీ లీల పాడెద దేవా’ అంటూ ఆలపించిన ఈ పాటకు ఆమెకు తెలుగులో ఎనలేని క్రేజ్‌ తీసుకొచ్చింది. ఈ చిత్రం తర్వాత జానకి తెలుగులో అవకాశాలు చాలానే వచ్చాయి. అయినా తెలుగులో గాయనిగా స్థిర పడటానికి ఆమెకు చాలా సమయం పట్టింది.
ప్రత్యేక స్థానం దక్కింది
అప్పటికే పి.సుశీల తెలుగులో టాప్‌ సింగర్‌గా ఒక వెలుగు వెలుగుతోంది. దాంతో టాలెంట్‌ ఉన్నా సెకండ్‌ గ్రేడ్‌ హీరోయిన్ల పాటలకు మాత్రమే జానకి పరిమితమయ్యేవారు. 1961లో విడుదలైన బావామరదళ్లు చిత్రంలోని ‘నీలి మేఘాలలో.. గాలికెరటాలలో’ పాటతో తెలుగు ప్రేక్షకలకు వీనులవిందు చేశారు జానకీ. 1964లో విడుదలైన పూజఫలం చిత్రంలో వచ్చే ‘పగలే వెన్నెల’ పాటతో ఆమెకు గాయనిగా ప్రత్యేక స్థానం దక్కింది. ఈ చిత్రం తర్వాత జానకమ్మకు సుశీలతో సమానంగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. 70వ దశకంలో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి, జానకి గాత్రంతో అనేక ప్రయోగాలు చేసాడు. బాలూ, జానకిల సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌కు బీజం పడేలా చేసాడు. ఒక రకంగా జానకి కెరీర్‌కు ఉపయోగపడే సోలో గీతాలు, డ్యూయట్లు ప్రేక్షకులను మైమరిపించేలా చేసాయి.
ఎనలేని కీర్తి ప్రతిష్టలు
సప్తపది చిత్రం జానకి సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోయింది. చిన్నపిల్లాడిలా, గోవులుకాసే గోపాలుడిగా.. రెండు వైవిధ్య గాత్రాలతో పాడిన ‘గోవులు తెల్లన, గోపయ్య నల్లనా’ పాట ఆమెకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చాయి. ఇలా తన గొంతుతో అన్ని వయసుల వారిని అనుకరించి మెప్పించిన ఘనత జానకికే దక్కుతుంది. ప్రేమ, విషాదం, హాస్యం, సోలో, విరహ గీతాలతో 80వ దశకం మొత్తం జానకమ్మ పాటలే ఎక్కువగా వినిపించాయి. జానకి సినీ కెరీర్‌లో సంగీత దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ‘మౌనపోరాటం’. తెలుగులో భానుమతి, పి.లీల తర్వాత సంగీతం దర్శకత్వం వహించిన మహిళ ఎస్‌.జానకి కావడం విశేషం.
వారి హావభావాలకు తగ్గట్టు
అలనాటి సావిత్రి, అంజలీదేవి నుంచీ నిన్నమెన్నటి విజయశాంతి, సౌందర్య, రంభ వరకూ.. దాదాపు ఐదు తరాల హీరోయిన్లకు పాడిన ఘనత జానకి సొంతం. వ్యాంపు పాటలకు, క్లబ్‌ పాటలకు ఎల్‌.ఆర్‌.ఈశ్వరీ తర్వాత అంతగా ఖ్యాతి గడించిన గాయని ఎస్‌.జానకి. అప్పటి నటీమణులకు వారి హావభావాలకు తగ్గట్టు పాడటంలో జానకి నిష్ణాతురాలు. సంగీత వాద్య పరికరాలకు అనుగుణంగా పాటలు పాడడంలో దిట్ట. ఒక కన్నడ చిత్రంలో ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ షెహనారుకి అనుగుణంగా పాడి మెప్పించారు. అలాగే మరోకన్నడ మూవీలో ఎం.ఎస్‌.గోపాలకృష్ణన్‌ వయోలిన్‌ వాద్య సమ్మేళనాన్ని తన గాత్రంతో డామినేట్‌ చేశారు.
అవార్డులకు లెక్కే లేదు
దాదాపు అనేక భాషల్లో 30వేలకు పైగా పాటలు పాడిన జానకిని వరించిన అవార్డులకు లెక్కే లేదు. నాలుగు జాతీయ అవార్డులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 25కు పైగా స్టేట్‌ అవార్డులు ఆమె వశం అయ్యాయి. తెలుగులో పది నంది అవార్డులు దక్కడం విశేషం. తెలుగులో వచ్చిన సితార చిత్రంలో ఆమె పలికిన ‘జిలిబిలి పలుకులకు’ జాతీయ అవార్డు వెతుక్కుంటూ వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక కలైమామణి, కర్ణాటక ప్రభుత్వంచే బసవభూషణ అవార్డు, మైసూరు యూనివర్సిటీ వారి నుంచి గౌరవ డాక్టరేట్‌లు జానకి కీర్తి కీరిటంలో వచ్చి చేరాయి. వయసు రీత్యా 84వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికీ స్టేజ్‌ షోల ద్వారా అప్పుడప్పుడు తన గాత్రంతో ప్రేక్షకులని మంత్రముగ్దులను చేస్తున్న ఈ గాన కోకిల మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుందాం…

Spread the love