మహిళకు ఇది యుద్ధం చేసినట్టే

It is like a war for a womanఆస్తా వోహ్రా… చదువు కోసం, ఉద్యోగం కోసం చేసిన సుదీర్ఘ ప్రయాణంలో ఆమెకు ప్రపంచం అంటే ఏమిటో తెలిసొచ్చింది. లింగ వివక్ష సమాజంలో ఎంతగా ఉందనే వాస్తవాన్ని అర్థం చేసుకుంది. తన సన్నిహిత మిత్రుడైన రితేష్‌ డి రిటెలిన్‌తో తన కొత్త అనుభవాలను పంచుకుంటున్న సమయంలో ఈ సమాజంలో ఒక అంతరం ఉందని గ్రహించింది. అమ్మాయిలకు ‘అలా వుండూ ఇలా ఉండకు’ అంటూ తీర్పు చెప్పే స్థితి నుండి వారిని వారిగా గుర్తించడం, అంగీకరించడం, అర్థం చేసుకోవడంలో సమాజానికి సహాయపడటానికి ఒక వంతెన అవసరమనుకుంది. ఆ ఆలోచన నుండి ఉద్భవించినదే ‘మంజురి’. ఇది ఇప్పుడు భారతదేశంలోనే మొదటి సెక్స్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీగా అవతరించడానికి ప్రయత్నిస్తోంది. సమాజానికి అవసరమైన సమగ్రమైన సానుకూల లైంగిక విద్య అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆమెతో సంభాషణ…
నేను ఒక పంజాబీ సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చాను. నిత్యం పురుషాధిక్యతను ఎదుర్కొనే సమాజం మనది. అయితే రితేష్‌తో మాట్లాడే సమయంలో నాకు అర్థమైంది, మహిళలకు వారి అవసరాలు, వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించే వేదిక ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదని. చాలా మంది ఇంటర్నెట్‌లపైనే ఆధారపడుతుంటారు. నేను కాలేజీలో చదివేటపుడు కొందరు నాకు ఫేస్‌ మసాజర్స్‌ గురించి చెప్పారు. ఇది చాలా చవకైన వైబ్రేటర్‌. ఇవన్నీ నిజానికి స్వీయ ఆనందం కోసం ఉద్దేశించిన వైబ్రేటర్లు. వీటి వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భారతీయ సమాజ సాంప్రదాయిక స్వభావమే దీనికి కారణం. మేము ఈ అంతరాన్ని గుర్తించాము. అదే నేటికీ బ్రాండ్‌గా మమ్మల్ని ప్రేరేపిస్తుంది. మేము ఏం చెప్పినా సూటిగా చెప్పాలనుకున్నాం. అందుకే మేము వైబ్రేటర్‌ను వైబ్రేటర్‌ అని పిలుస్తాము, ‘మసాజర్‌’ అని కాదు.
ఉద్యోగాన్ని విడిచిపెట్టాను
మంజురి ప్రారంభించినప్పుడు నాకు మద్దతుదారులు ఎవరూ లేరు. మొదటి ఆరు నెలలు నా ఉద్యోగం చేసుకుంటూనే కొంత సమయం మాత్రమే మంజురి కోసం ప్యాకేజింగ్‌, షిప్పింగ్‌, కస్టమర్‌ సర్వీస్‌ను కూడా నిర్వహించాను. అయితే తక్కువ కాలంలోనే మాకు మంచి స్పందన వచ్చింది. కస్టమర్ల నుండి మేము అందుకున్న ప్రేమ, ఆకర్షణ చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ఆ ఆధరణతోనే నా మిషన్‌ కోసం పూర్తి సమయం కేటాయించడానికి ఎనిమిది నెలల్లోనే నా ఉద్యోగాన్ని విడిచిపెట్టాను. ఇది ఒక కంపెనీగా ఎదిగేందుకు మాకు అవసరమైన గొప్ప మద్దతు రితేష్‌, అతని కుటుంబం నుండి వచ్చింది.
యుద్ధం చేయడమే
మహిళలు తరచుగా తమ హక్కులు, అవసరాల కోసం నిలబడేందుకు సంకోచిస్తుంటారు. సాధారణంగా ఈ సమాజంలో మహిళల శక్తిని తక్కువగా అంచనా వేస్తారు. నాకు మహిళల నుండి కూడా పెద్దగా మద్దతు లభించలేదు. అలాంటి సమయంలో పురుషుల నుండి వచ్చిన తిరుగులేని ప్రోత్సాహానికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఈ అనుభవం నాకు స్త్రీ, పురుషుల నుండే కాదు ట్రాన్స్‌జెండర్స్‌ నుండి కూడా మద్ధతు వచ్చేలా చేసింది. ఒక భారతీయ మహిళగా నేను నిషిద్ధ అంశాల గురించి మాట్లాడుతున్నానంటే ఇది కూడా ఓ యుద్ధం చేయడం లాంటిదే. ఎందుకంటే మన దేశంలో మహిళలు తమ ఆలోచనలు, కోరికలు, ముఖ్యంగా లైంగిక అవసరాల గురించి బయటకు చెప్పకూడదకు. అలా చెప్తే వాళ్ళు ఎంతో పాపం చేసినట్టు.
సవాళ్లు ప్రత్యేకమైనవి
కంపెనీ గురించి ప్రచారం చేసేందుకు సోషల్‌ మీడియాను ఉపయోగించు కోవాలనుకున్నాం. ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నాం. కానీ మేము అతి కొద్ది కాలంలోనే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, నెట్‌వర్కింగ్‌ సైట్‌లు, చెల్లింపు గేట్‌వేల నుండి నిషేధించబడ్డాము, తిరస్కరించబడ్డాము. దీనిపై మేము కేసు కూడా వేశాము. దాంతో నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ కొంత కాలం తర్వాత మాపై నిషేధాన్ని తీసివేసింది. ఇప్పుడు సెక్స్‌పోజిటివ్‌ కంటెంట్‌కు మరింత పుష్‌ ఇచ్చింది. ఇలాంటి మద్దతు కోసం మేమెంతో కృషి చేశాం. ఎందుకంటే మేము ఒంటరిగా చేయలేమని మాకు తెలుసు. మా కేసును ముందుకు తీసుకురావడానికి సంఘం మాకు సహాయం చేసింది. అలాగే ‘మహిళగా ఉండి సెక్స్‌ టాయిస్‌ ఎందుకు అమ్ముతున్నావు, పెండ్లి
తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తావా, మాస్టర్స్‌ చేసి ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఏటి’ ఇలా ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటారు. కానీ నేను మాత్రం ఇలాంటి ఒక వేదిక మన మహిళలకు అవసరం అని గుర్తించాను. కనుక ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తాను.
సానుకూల స్పందన
అతి తక్కువ కాలంలోనే ఆడా, మగా తేడా లేకుండా ప్రజలందరి నుండి సానుకూల స్పందన వచ్చింది. ఇది మాకు ఆనందకరమైన ఆశ్చర్యాన్ని కలిగించింది. మా ఆఫ్‌లైన్‌ ఈవెంట్‌ల సమయంలో 20 నుండి 50 ఏండ్ల వయసు గల మహిళలు నా దగ్గరకు వచ్చి ఇలాంటి అవగాహనా కార్యక్రమాలు చాలా అవసరమంటూ హృదయపూర్వకంగా మనసు విప్పి మాట్లాడేవారు. ఎప్పుడైనా నేను ఈ పని చేయగలనా అని ఢలాీ పడినప్పుడు ఇలాంటి ప్రేమ నన్ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకువస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒక కస్టమర్‌ మాకు ఉత్సాహం కలిగించే విధంగా వాయిస్‌ మెసేజ్‌ పెట్టింది. ఇలాంటి ఉద్వేగభరితమైన మహిళలను కలవడం వల్ల నా లక్ష్యాన్ని సాధించడానికి నేను ఒక అడుగు దగ్గరగా ఉన్నాననే భరోసాను నాకు ఇస్తుంది.
మనసు విప్పి చెప్పేలా…
స్త్రీలు తమ సొంత అవసరాలు, కోరికలను నియంత్రించుకున్నప్పుడు అది వారి జీవితంలోని ప్రతి అంశంపైనా కచ్చితంగా ప్రభావం చూపుతుంది. దీన్ని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. కనుక వారు మనసు విప్పి తమ ఆలోచనలు చెప్పుకునే అవకాశం కల్పించాలి. అది వృత్తిలో, బెడ్‌ రూంలో, బోర్డ్‌రూమ్‌లో’ ఎక్కడైనా కావొచ్చు. వారికి నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పే హక్కు వారికి ఉంటుంది.
– సలీమ

Spread the love