పిల్లల్ని ఎలా పెంచకూడదో చూపించాం

పిల్లల్ని ఎలా పెంచకూడదో చూపించాంనాని మూవీ వర్క్స్‌, రామా క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. ఈ మూవీకి కథ, డైలాగ్స్‌, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం రమాకాంత్‌ రెడ్డి వహించారు.డాక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 29న రాబోతోంది. ఈ క్రమంలో హీరో విశ్వ కార్తికేయ మంగళవారం మీడియాతో సంభాషించారు. ప్రతీ మనిషిలో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయి. వాటిని చూపించేలా ఈ చిత్రం ఉంటుంది. నంద్యాలలో ఈ సినిమా కథ జరుగుతుంది. అందుకే ఈ సినిమాకు ‘కలియుగం పట్టణంలో’ అని పెట్టాం. నేను ఎలాంటి పాత్రనైనా చేయగలను అనే పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాను. ఇందులో ప్రతీ పాత్ర చక్కగా ఉంటుంది. అన్ని క్యారెక్టర్లకు రెండు షేడ్స్‌ ఉంటాయి. రెండు షేడ్స్‌ ఉంటాయా?, డబుల్‌ రోలా? అనేది చెప్పలేం. ఇది స్క్రీన్‌పైనే చూడాలి. నాకు మాత్రం ఈ కథ చాలా నచ్చింది. అందుకే ఎంతో ఇష్టంతో ఈ చిత్రాన్ని చేశాను.
నేను ఇంతకు ముందు చేసిన ‘కళాపోషకులు’ పూర్తిగా వినోదాత్మ కంగా ఉంటుంది. ‘అల్లంత దూరానా’ మెలో డ్రామాగా ఉంటుంది. ‘జై సేన’ అనేది పూర్తి కమర్షియల్‌గా ఉంటుంది. అయితే ఈ చిత్రం మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. థ్రిల్లర్‌, సస్పెన్స్‌ మాత్రమే కాకుండా మదర్‌ సెంటిమెంట్‌ కూడా ఉంటుంది. ప్రతీ రెండు మూడు సీన్లకు కొత్త జోనర్‌లా అనిపిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. నా కెరీర్‌లో ఇది ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.
ఇందులో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూపిస్తాం. పిల్లల్ని తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోతే ఎలా ఉంటుందో చూపిస్తాం. తల్లిదండ్రులు తమ తమ పిల్లల్ని ఎలా పెంచకూడదో చూపించాం. ఎలా పెంచితే పిల్లలు ఎలా తయారవుతారో చూపించాం. చెడుని చెడుతోనే ఈ చిత్రంలో చూపిస్తాం. మా సినిమాను అన్నపూర్ణ బ్యానర్‌ రిలీజ్‌ చేస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా తర్వాత ఓ ఇండోనేషియా ప్రాజెక్ట్‌ చేస్తున్నాను. ఆ మూవీలోనూ ఆయుషి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ మూవీ వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది.

Spread the love