హరితహారం అగ్గిపాలేనా..?

– జాతీయ రహదారి పక్కన నిప్పుపెట్టడం తో కాలిపోయిన చెట్లు
– నీరు గారుతున్న నిర్లక్ష్యం..
నవతెలంగాణ – పెద్దవూర
రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన హరితహారం పథకం అభాసుపాలవుతోంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. పచ్చదనం పెంపులో కీలకంగా మారాల్సిన అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ కార్యక్రమం నిర్వీర్యమవుతోంది. నాటిన మొక్కలు పెద్దయిన తరువాత కాల్చి వేస్తున్నారు .నల్గొండ జిల్లాలో పెద్దవూర మండలం నాగార్జున సాగర్ నియోజకవర్గం చలకుర్తి ఎక్స్ రోడ్డు వద్ద నాగార్జున సాగర్ హైదరాబాద్ జాతీయ రహదారి పై రెండు వరసల్లో చెట్లు పెంచారు.రూ. లక్షలు వెచ్చించి గత పదేళ్లు నుంచి పెంచి పెద్ద జేసిన చెట్లు చాలా చోట్ల నిప్పు పెట్టడంతో చెట్లన్ని కాలిపోయాయి.దీంతో రూ. లక్షల నిధులు వృథా అయ్యాయి.
లక్ష్యం నీరుగారుతోంది..
సాగర్ నియోజకవర్గం లోని బెట్టల తండా, గర్నెకుంట, పోతునూరు, వెల్మ గూడెం, పినవూర, కొత్తలూరు, పెద్దగూడెం, ఉట్లపల్లి, చలకుర్తి, కుంకుడు చెట్టు తండా, రోడ్ల వెంట గ్రామాల్లో వేల సంఖ్యలో చెట్లు పెరిగాయి. సరైన ప్రణాళికలు లేకపోవడంతో రోడ్ల వెంట విద్యుత్తు తీగల కింద నాటారు. ఏపుగా పెరగగానే విద్యుత్తు సమస్య తలెత్తుతుందని కొమ్మలు, చెట్లను నరికివేస్తున్నారు. ఈదురుగాలులు, వర్షాలకు చెట్లు విరిగి విద్యుత్తు తీగలపై పడుతున్నాయి.
ప్రత్యేకాధికారులు దృష్టిపెడితేనే..
సర్పంచుల పదవీ కాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలన రావడంతో వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Spread the love