పేదరికం తగ్గిందా?

– వాస్తవాలకు భిన్నంగా వాదనలు
– మసిబూసిమారేడు కాయ చేసే ప్రయత్నాలు
– నిటి ఆయోగ్‌ సూచిక లేవనెత్తిన ప్రశ్నలెన్నో
న్యూఢిల్లీ: దేశంలో పేదలకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. ఒకసారి వీరు పేదలుకాదు అని నిర్ణయించాక వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమమేదీ అందదు. ఇప్పుడు సుమారు 25 కోట్లమంది ప్రజలు ఉన్న పళంగా పేదరికం నుంచి బయటపడ్డారని నిటి ఆయోగ్‌ చెపుతున్నది. ఇది కేవలం ఒక రాజకీయ వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యూహం ద్వారా వారు రెండు లక్ష్యాలను సాధించబోతున్నారు. ఒకటి, ఇరవై అయిదు కోట్ల మందిని ప్రభుత్వ సంక్షేమ పరిధిలో నుంచి గెంటేయడం. రెండు, తమ ఘనత వహించిన పాలనలో పేదల సంఖ్య తగ్గిందని ఎన్నికల ముందు ప్రచారం చేసుకోవడమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. నిటి ఆయోగ్‌ తాజా నివేదిక సారాంశమిదేనా?
బహుమితీయ పేదరిక సూచికపై నిటి ఆయోగ్‌, యూఎన్‌డీపీలు చర్చా పత్రాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశంలో పేదరిక రేటు, పేద ప్రజల సంఖ్య తగ్గిపోయింద ని చూపేందుకు ఈ పత్రం శతవిధాలా ప్రయత్నించింది. అయితే పేదరికంపై రూపొందించిన చర్చా పత్రం విషయంలో సిద్ధాంతపరంగా, అవలంబించిన విధానం పైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే పేదరికం అనేది విధానపరంగా, సంక్షేమపరంగా, ప్రభుత్వ సిద్ధాంతాల పరంగా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అయితే దురదృష్టవశాత్తూ ఈ సమస్యలపై అటు ప్రభుత్వం కానీ, ఇటు నిటి ఆయోగ్‌ కానీ తగిన శ్రద్ధ చూపడం లేదు. దానికి బదులుగా దేశంలో పేదరికం తగ్గిపోయిందని ప్రచారం చేస్తూ, అందుకు మద్దతుగా ఏవో కొన్ని గణాంకాలను ఏకరువు పెట్టి వాస్తవాలను మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత పది సంవత్సరాల మోడీ పాలనలో జరిగింది ఇదే. పేదరికంపై నిటి ఆయోగ్‌ విడుదల చేసిన సూచికను నిశితంగా గమనిస్తే అనేక వాస్తవాలు వెలుగు చూస్తాయి. పేదరిక సూచిక కోసం ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు అనే మూడు కోణాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మూడింటికీ 12 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆరోగ్యానికి సంబంధించి పోషకాహారం, పిల్లలు-కౌమార మరణాలు, తల్లి ఆరోగ్యం అనే అంశాలను సూచికలుగా తీసుకుంటారు. విద్యకు సంబంధించి పాఠశాలలో చదివిన సంవత్సరాలు, హాజరును పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే జీవన ప్రమాణాల విషయంలో వంటలో ఉపయోగించే ఇంధనం, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌, నివాసం, ఆస్తులు, బ్యాంక్‌ ఖాతాలు సూచికలు అవుతాయి.
నిటి ఆయోగ్‌ ఏం చెప్పింది?
నిటి ఆయోగ్‌ సూచిక ప్రకారం దేశ జనాభాలో బహుమితీయ పేదరికం 2013-14లో 29.17శాతం ఉండగా 2022-23 నాటికి 11.28శాతానికి తగ్గింది. ఆ తొమ్మిది సంవత్సరాల కాలంలో పేదరికం నుండి 24.82 కోట్ల మంది బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పేదరికం బాగా తగ్గింది. అయితే ఈ వాదనలో విశ్వసనీయత ఉన్నదా అనేదే ప్రశ్న. ఆర్థికవేత్త సంతోష్‌ మెహ్రోత్రా నిటి ఆయోగ్‌ వాదనతో ఏకీభవించడం లేదు.
రాజకీయ వ్యూహమే
మహ్రోత్రా ఇటీవల ‘వైర్‌’ వెబ్‌సైట్‌లో రాసిన వ్యాసం ప్రకారం…గత తొమ్మిది సంవత్సరాల్లో జీడీపీ వృద్ధి రేటు సంవత్సరానికి 5.7శాతం పడిపోయింది. ఆ కాలంలో సాధించిన 7.9శాతం వార్షిక వృద్ధి రేటు సారూప్య ఫలితాన్ని అందిస్తుందని భావించడానికి ఆధారమేమీ లేదు. 2014 నుండి 2022 వరకూ ఎనిమిది సంవత్సరాల పాటు వినియోగ వ్యయ సర్వేలు నిర్వహించలేదు. అయినప్పటికీ పేదరిక సూచిక కోసం ఎన్‌ఎంపీఐని ఉపయోగించుకోవడం రాజకీయ వ్యూహమే. కోవిడ్‌, దాని కారణంగా విధించిన లాక్‌డౌన్‌లు, ఇతర ఆంక్షలు దేశంలోని పేద కుటుంబాలను, రాష్ట్రాలను ఇబ్బందుల పాలు చేశాయి. ఆదాయం తక్కువగా ఉన్నవారు కోవిడ్‌ సమయంలో ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఆదాయ క్షీణత ఎక్కువగా ఉంది.
ఇవి కఠోర సత్యాలు
2021 డిసెంబర్‌, 2022 జనవరిలో సమాజంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిలో, అట్టడుగు వర్గాల వారిలో ఆదాయాలు తగ్గిపోయాయి. ఆహార భద్రత కొరవడింది. 80శాతం మంది ప్రజలు ఆహార అభద్రతతో బాధపడ్డారు. 25శాతం మందిలో ఇది మరింత తీవ్రంగా ఉంది. భోజనం మానేయడం, ఆహారాన్ని తగ్గించుకోవడం, ఆహారం అయిపోవడం, రోజంతా తినకపోవడం, ఆకలితో పడుకోవడం…వంటివి చోటుచేసుకున్నాయి. తాము పోషకాహార లోపంతో బాధపడుతున్నామని 41శాతం మంది తెలిపారు. సర్వేకు ముందు నెలలో 67శాతం మంది వంట గ్యాస్‌ కొనుగోలు చేయలేకపోయారు. కోవిడ్‌ కారణంగా తలెత్తిన ఆర్థిక మాంద్యంతో ఏడున్నర కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గిపోయారని ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ తెలిపింది. 2020 మార్చి-అక్టోబర్‌ మధ్యకాలంలో భారతీయ కుటుంబాల ఆదాయం సగటున 22శాతం తగ్గిపోయింది.
వాస్తవాలు ఇంత కఠినంగా ఉంటే నిటి ఆయోగ్‌ సూచిక మాత్రం ‘ఫీల్‌ గుడ్‌’ అంటోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి హ్యాట్రిక్‌ విజయాన్ని అందించేందుకు నిటి ఆయోగ్‌ తన వంతు పాత్ర పోషిస్తోందని చెప్పక తప్పదు.

Spread the love