భారీ వర్షం.. నీళ్లపాలైన ధాన్యం

Heavy rain.. waterlogged grain– ఈదురుగాలుల బీభత్సం
– పలుచోట్ల వడగండ్లు
– విద్యుత్‌ సరఫరాకు అంతరాయం
– సిద్దిపేట జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
– హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన
నవతెలంగాణ- విలేకరులు
ఎండ, వడగాడ్పులతో మధ్యాహ్నం వరకు ఉక్కిరిబిక్కిరి చేయగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి పలు జిల్లాల్లో ఈదురు గాలులు.. ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ వడగండ్లు, పిడుగులు పడ్డాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడ్డాయి. సిద్దిపేటలో పిడుగుపాటుకు రైతు మృతిచెందాడు. కల్లాల్లోని ధాన్యం తడిసి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వర్షం వల్ల సాయంత్రం జరగాల్సిన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార సభలు రద్దయ్యాయి. హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది.
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వడగండ్ల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీళ్లపాలైంది. రాయికల్‌, కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలో పిడుగుపాటుకు గేదె మృత్యువాత పడింది. వేములవాడ, జూలపల్లి గన్నేరువరంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. సుల్తానాబాద్‌, చొప్పదండిలో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్‌లోని వందల క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయింది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో జరగాల్సిన కాంగ్రెస్‌ జనజాతర సభ రద్దయింది.
ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దహెగాం మండల కేంద్రంలో తాటిచెట్టుపై పిడుగుపడి పూర్తిగా కాలిపోయింది. ఐనం, బీబ్రా, బోర్లకుంట తదితర గ్రామాల్లో గాలి వానతో పాటు వడగండ్లు పడ్డాయి. బీబ్రా గ్రామంలో విద్యుత్‌ తీగలపై చెట్లు విరిగిపడగా.. తీగలు ఇండ్లపై పడ్డాయి. బోర్లకుంట గ్రామంలో బొందుగుల స్వామి ఇల్లు కూలింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. పెంచికల్‌పేట్‌ మండల వ్యాప్తంగా కల్లాల్లో ఉన్న వరిధాన్యం తడిచింది. బెజ్జూర్‌ మండలంలోని కుకుడ, ముంజంపెల్లి గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. కౌటాల మండలంలో నాగెపెల్లి గ్రామంలో పిడుగు పడి రైతు మోర్లె దస్రుకు చెందిన ఎద్దు మృత్యువాత చెందింది. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి(కె), పల్లి(బి) గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా జైపూర్‌, మందమర్రి మండలాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వరి ధాన్యం తడిసి పోయింది. వడగళ్ల వానకు కోత దశకు వచ్చిన వరిపైరు నేలకొరిగింది. మామిడి పంట నేలరాలింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాంకిడి, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట, కాగజ్‌నగర్‌, కౌటాలా, సిర్పూర్‌(టీ) భారీ వర్షం కురిసింది.
తడిసి ముద్దాయిన ధాన్యం కుప్పలు
భూపాలపల్లి జిల్లా మహముత్తారం, గణపురం మండలాల్లో మోస్తరు వర్షాలు కురిసాయి. ధాన్యం గింజలు నేల రాలిపోయాయి. మామిడి కాయలు నేలరాలాయి. పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దవగా, కొన్నిచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల వ్యాప్తంగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. మల్హర్‌రావు మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులకు ఇరువైపులా చెట్లు విరిగి కరెంట్‌ తిగలపై పడటంతో విద్యుత్‌ సరఫరా నిలిపిపోయింది. వరంగల్‌ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో ఈదురు గాలులకు మొక్కజొన్న పంటకు నిప్పు అంటుకొని దాదాపు 20 ఎకరాల వరకు పంట బూడిదైపోయింది. 10 ఎకరాలలో డ్రిప్‌ పైపులు పనికిరాకుండా కాలిపోయాయి. పంట విలువ దాదాపు రూ.10లక్షలు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట డివిజన్‌ పరిధిలో వర్షానికి పంటల నష్టం జరిగింది. వరంగల్‌ కాశీబుగ్గ సర్కిల్‌ పరిసర ప్రాంతంలో వర్షపు నీరు మోకాలు లోతు వరకు నిలవడంతో చెరువును తలపించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఖానాపూర్‌, చెన్నారావుపేట, పర్వతగిరి, రాయపర్తి, గీసుగొండలో ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో భారీగా వర్షం కురిసింది. రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. పొలాల్లో ఉన్న పశుగ్రాసం ఈదురు గాలులకు కొట్టుకుపోయింది. మామిడి కాయలు నేలరాలాయి.
హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌..!
జంటనగరాలైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిధిలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు, డ్రైయినేజీలు పొంగి పొర్లాయి. పలు బస్తీలు, కాలనీలలో ఇండ్లలోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వాహనాదారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. సికింద్రాబాద్‌, చిలకలగూడ, మారేడుపల్లి, బోయిన్‌పల్లి, ప్యారడైజ్‌, ప్యాట్నీ, మలక్‌పేట, ఎర్రగడ్డ, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, అల్వాల్‌, ఎల్బీనగర్‌, కాప్రా, సుచిత్ర జీడిమెట్ల, ముషీరాబాద్‌, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి వరదనీరు చేరగా.. మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్‌లో రోడ్లపై భారీగా వర్షం నీరు చేరడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి ఐకీయా వరకు, ఖాజాగూడ చౌరస్తా నుంచి డీపీఎస్‌ వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల చెట్లు విరిగి పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వర్షం, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా బంద్‌ అయింది. ఇదిలా ఉండగా నగరంలో కురిసిన భారీ వర్షంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ సమీక్షించారు.
పిడుగుపడి వ్యక్తి మృతి
సిద్దిపేల జిల్లా కుకునూర్‌పల్లి మండల కేంద్రంలో పిడుగుపడి వ్యక్తి మృతిచెందాడు. చెందిన సంఘటన కుకునూర్‌పల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. కుమ్మరి మల్లేశం(33) బర్రెల పాల పితకడం కోసం వ్యవసాయ బావి దగ్గరకి వేళ్లగా అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వర్షం పడింది. దాంతో మల్లేశం చెట్టుకిందకు వెళ్లాడు. చెట్టుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆరుగాలం కష్టపడిన రైతులు వర్షం వల్ల ఆగమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది.

Spread the love