నవతెలంగాణ-హైదరాబాద్
కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టుల మధ్య గోదావరి వరద ముంపు రక్షణ చర్యలపై తీసుకున్న చర్యలను నివేదించాలని కోరుతూ కేంద్రంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ రెండు ప్రాజెక్టుల నిర్మాణాల నేపథ్యంలో గోదావరి ముంపుపై తగిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంరెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. లాయర్ కె.శ్రావణ్‌కుమార్ వాదిస్తూ, తెలంగాణలో కాళేశ్వరం, ఏపీలో పోలవరం ప్రాజెక్టుల వల్ల మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, పెద్దపల్లి తదితర జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురౌతాయని చెప్పారు. కొమరంభీమ్, ములుగు జిల్లాల్లో పంట ముంపునకు గురౌతుందన్నారు. ఆ రెండు ప్రాజెక్టు నిర్మాణాల వల్ల జరిగే నష్టంపై అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. మంచిర్యాల, భద్రాచలం పట్టణాలతోపాటు మహారాష్ట్రలోని సిరొంచలో రక్షణ గోడలు నిర్మించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. తెహ్రీడ్యాం, సర్దార్ సరోవర్ ప్రాజెక్టుల వ్యవహారంలో సమస్యల పరిష్కారానికి ఒక ఆథారిటీ తరహాలో ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలన్నారు. వాదనల తర్వాత తర్వాత కేంద్రం హౌం, పర్యావరణ, జలశక్తి శాఖలు, జాతీయ విపత్తుల మండలి, ఏపీ, తెలంగాణలకు నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.