హిట్‌మ్యాన్‌ ధమాకా

హిట్‌మ్యాన్‌ ధమాకా– ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం
– భారత్‌ 205/5, ఆస్ట్రేలియా 181/7
– 41 బంతుల్లో 92 బాదిన రోహిత్‌ శర్మ
కంగారూల ఖేల్‌ ఖతం!. చావోరేవో తేల్చుకోవాల్సిన సూపర్‌8 మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్తయ్యింది. వరుసగా రెండో ఓటమితో సెమీఫైనల్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 206 పరుగుల ఛేదనలో ఆసీస్‌ 181 పరుగులకే పరిమితమైంది. 24 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (92) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ 205 పరుగుల భారీ స్కోరు చేసింది. 19 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన రోహిత్‌ శర్మ.. ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో విశ్వరూపం చూపించాడు.
నవతెలంగాణ-గ్రాస్‌ఐలెట్‌
ఆస్ట్రేలియాపై భారత్‌ 24 పరుగుల తేడతో ఘన విజయం సాధించింది. 2023 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది!. కీలక సూపర్‌8 మ్యాచ్‌లో నెగ్గి.. ఆసీస్‌ సెమీఫైనల్‌ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. 206 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా 181 పరుగులే చేసింది. ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ (76, 43 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (37, 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఫలితం దక్కలేదు. వార్నర్‌ (6), స్టోయినిస్‌ (2), మాక్స్‌వెల్‌ (20), టిమ్‌ డెవిడ్‌ (15), మాథ్యూ వేడ్‌ (1) భారత బౌలర్ల ముంగిట తేలిపోయారు. అర్షదీప్‌ సింగ్‌ (3/37), కుల్దీప్‌ యాదవ్‌ (2/24) ఆసీస్‌ ఆట కట్టించారు. అంతకుముందు, రోహిత్‌ శర్మ (92, 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కటంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (31, 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్య (27 నాటౌట్‌, 17 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), శివం దూబె (28, 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.
హైహై.. నాయకా! :
టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా మరోసారి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కొత్త బంతితో స్టార్క్‌, హాజిల్‌వుడ్‌ నిప్పులు చెరగటంతో భారీ స్కోరు కష్టమే అనిపించింది. విరాట్‌ కోహ్లి (0) డకౌట్‌గా నిష్క్రమించగా 2 ఓవర్లలో భారత్‌ 6/1తో పేలవంగా మొదలెట్టింది. రోహిత్‌ శర్మ ధనాధన్‌తో ఇక్కడ్నుంచి మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. మిచెల్‌ స్టార్క్‌ ఓవర్లో వరుసగా 6, 6, 4, 6, 0, 6తో ఆకాశమే హద్దుగా బాదేసిన రోహిత్‌ శర్మ ఆ ఓవర్లో ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు. దీంతో 6/1తో ఉన్న భారత్‌ 3 ఓవర్లలో 35/1తో దూకుడు పట్టాలెక్కింది. ఓ ఎండ్‌లో రోహిత్‌ శర్మ ఊచకోత కొనసాగగా.. రిషబ్‌ పంత్‌ (15) కాస్త ఇబ్బంది పడ్డాడు. స్వేచ్ఛగా విరుచుకుపడిన రోహిత్‌ శర్మ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 19 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. రోహిత్‌, పంత్‌ జోడీ రెండో వికెట్‌కు 38 బంతుల్లోనే 87 పరుగులు పిండుకోవటం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అర్థ సెంచరీ తర్వాత మూడు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదిన రోహిత్‌ శర్మ సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. స్టార్క్‌ ఓవర్లోనే వికెట్‌ కోల్పోయి నిష్క్రమించాడు. రోహిత్‌ అవుటైనా.. భారత జోరు తగ్గలేదు. సూర్యకుమార్‌ యాదవ్‌ (31), శివం దూబె (28) మిడిల్‌ ఓవర్లలో మెరుగా.. హార్దిక్‌ పాండ్య (27 నాటౌట్‌) డెత్‌ ఓవర్లలో చెలరేగాడు. రవీంద్ర జడేజా (9 నాటౌట్‌) ఓ సిక్సర్‌తో అలరించాడు. ఆసీస్‌ బౌలర్లందరూ రెండెంకల ఎకానమీతో గణాంకాలు గల్లంతు చేసుకోగా.. హాజిల్‌వుడ్‌ (1/14) 24 బంతుల్లో 14 పరుగులే ఇచ్చి ఆకట్టుకున్నాడు.
శతకం చేజార్చుకున్న రోహిత్‌ శర్మ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. బాబర్‌ ఆజమ్‌ (4145)ను దాటేసి 4165 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Spread the love