పెండ్లి కోసం ప్రియుడి కాలర్ పట్టుకుని..!

నవతెలంగాణ – పాట్నా: ఒక మహిళ ప్రియుడి ఆఫీస్‌కు చేరుకుంది. అతడి చొక్కా కాలర్‌ పట్టుకుని గుడికి ఈడ్చుకెళ్లింది. తనను పెండ్లి చేసుకోవాలని పట్టుపట్టింది. బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భథోడియా గ్రామానికి చెందిన రోహిత్ కుమార్, కరిష్మా మధ్య గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో తనను పెండ్లి చేసుకోవాలని రోహిత్‌ను ఆమె బలవంతం చేసింది. దీంతో కరిష్మా తలపై సింధూరం పెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే పెండ్లికి అంగీకరించని రోహిత్‌ కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్‌ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు కరిష్మా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. కాగా, రోహిత్‌ బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ విషయం తెలిసిన కరిష్మా తనను పెండ్లి చేసుకోవాలంటూ అతడిపై మరోసారి ఒత్తిడి తెచ్చింది. అంతేగాక రోహిత్‌ పని చేసే కార్యాలయానికి ఆమె వెళ్లింది. అతడి టీ షర్ట్‌ కాలర్‌ను పట్టుకుని స్థానిక బుద్ధ నాథ్ ఆలయానికి ఈడ్చుకొచ్చింది. తనను పెండ్లి చేసుకోకపోతే విషం తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు రావాలంటూ ఇరు కుటుంబాలకు సమన్లు జారీ చేశారు. వారి పెద్దలతో మాట్లాడి ఈ జంట కేసుపై చర్యలు తీసుకుంటామని పోలీస్‌ అధికారి తెలిపారు.

Spread the love