నవతెలంగాణ – హైదరాబాద్ : గృహిణులు దేశ నిర్మాతలు అని, వారు చేసే పనికి కనీసం రూ.30,000 పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. రోడ్డు ప్రమాదాల్లో గృహిణులు మరణిస్తే వారికి పరిహారం కింద నెలకు కనీసం రూ. 30 వేల రూపాయలైనా చెల్లించాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్‌లో నవంబర్ 2001లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రేష్మ అనే మహిళ మరణించగా, దానికి సంబంధించిన పరిహార దావాపై దాఖలైన అప్పీలులో సుప్రీం ఈ తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో మృతి చెందిన రేష్మ భర్త, ఆమె ముగ్గురు పిల్లలు నష్టపరిహారం కోరుతూ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ 2003లో పరిహారం మంజూరు చేసింది. అయితే పరిహార మొత్తాన్ని పెంచాలని కోరుతూ వారు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పరిహారాన్ని 7.5 శాతం వడ్డీతో 8.43 లక్షలకు పెంచింది. ఒకవేళ చెల్లింపులో జాప్యం జరిగితే అధిక వడ్డీరేటు వర్తించేలా నిబంధన విధించింది.
కాగా, ఈ సందర్భంగా గృహిణి చేసే కృషి కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా, దేశ నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. గృహిణులు ఇంటి పని చేస్తూ, పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ.. వారి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. అంతిమంగా వారు దేశాభివృద్ధికి కృషి చేస్తారు అని కోర్టు అభిప్రాయపడింది. వేతనం లేని గృహిణులు చేసే పనిని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈ దృష్ట్యా రోడ్డు ప్రమాదాల్లో గృహిణులు మరణిస్తే.. నెలకు రూ.30,000 చొప్పున ప్రత్యేక పరిహారాన్ని మంజూరు చేయాలని మోటారు ప్రమాదాల పరిహార ట్రిబ్యునల్ (ఎంఎసిటిని)ను సుప్రీం ఆదేశించింది.
గృహిణి చేసే పనికి వెల కట్టలేమని, ఆమె చేసే పనికి ఈ మొత్తాన్ని కనీస విలువగా పరిగణించడం జరిగిందని, అలాగే ప్రతి మూడేళ్లకు ఒకసారి ఇది 10 శాతం పెరుగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ ఆ గృహిణికి ఉద్యోగం ఉంటే, ఆమె సంపాదనకు అదనంగా ఈ మొత్తాన్ని చెల్లంచాలని సుప్రీం ఆదేశించింది. ఈ సందర్భంగా గృహిణుల పనిపై 2019లో నిర్వహించిన ‘టైమ్ యూజ్ సర్వే’ను కూడా కోర్టు ఉటంకించింది. 15 – 59 వయసు మహిళలు వేతనం లేని గృహ, సరక్షణ పనుల కోసం రోజూ 7 గంటలకు పైగా సమయం గడుపుతున్నారని, పురుషులు మూడు గంటల కంటే తక్కువ సమయమే గడుపుతున్నారని ఈ సర్వే తెలిపింది. అలాగే మహిళలు ఆర్థికంగా తోడ్పడుతున్నప్పటికీ, సగటున 2.6 రెట్లు ఎక్కువ వేతనం లేని సంరక్షణ/గృహ పనులను చేస్తున్నారుని ఈ సర్వే తెలిపింది.
సమాజంలో సాధారణంగా ఇటువంటి బాధ్యతలు మహిళలపైనే పడుతుంది. అందుకే దేశంలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం 31.7 శాతం ఉండడానికి ఇది కారణంగా న్యాయస్థానం పేర్కొంది. మహిళలు చేసే వేతనం లేని సంరక్షణ సేవలు భారతదేశ జీడీపీకి 15-17 శాతం వాటాను అందిస్తున్నాయని అంచనా. అయినా అది గుర్తింపు లేని పనిగా భావించడం జరుగుతుందని కోర్టు పేర్కొంది.



