పదేండ్లలో రూ.8.21 లక్షల కోట్లు అప్పులు చేశారు
దానిలో రూ. లక్ష కోట్ల అవినీతి చేశారు
దొర అహంకారాన్ని మరోసారి బొందపెట్టాలి
2029లో రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలి
మిడ్జిల్ కృతజ్ఞత సభలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ -మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి/ఊరుకొండ
మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి రూ.లక్షల కోట్ల ఆస్తులు, వేల ఎకరాల ఫాంహౌజ్‌లు ఎలా వచ్చాయని సీఎం ఏ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ర్టాన్ని పదేండ్లు పాలించి, రూ.8.21 లక్షల కోట్లు అప్పులు చేశారనీ, దానిలో రూ.లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పదేండ్లలో ఏం వ్యాపారం చేశారని వేల కోట్ల సంపాదన వచ్చిందన్నారు. ఆడబిడ్దలకు ఇచ్చే బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు దండుకున్న దుర్మార్గులు, నీచులు అంటూ ఫైర్ అయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలో మిడ్జిల్ జడ్పీటీసీగా గెలిచి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం రేవంత్ మిత్ర మండలి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో కృతజ్ఞత సభను నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం మిడ్జిల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అరుంధతి సినిమాలో పశుపతిని గదిలో బంధించినట్టు ప్రజలు కేసీఆర్‌ను ఫామ్ హౌజ్‌లో బంధిస్తే, ఆయనే మళ్లీ రావాలంటూ అయన కుటుంబసభ్యులు కోరుకుంటున్నారని చెప్పారు. దేనికోసం ఆయన రావాలో… ప్రజా ప్రభుత్వం ఎందుకు పోవాలో ఎక్కడ నలుగురు కలిస్తే అక్కడ ప్రజలే చర్చకు పెట్టుకోవాలని అన్నారు. అప్పులు, తప్పులు చేసినవాళ్లు మళ్లీ వస్తే రాష్ట్రంలో భార్యతో కూడా ఫోన్ స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితులు నెలకొంటాయన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్‌రావులకు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు గతం తప్ప భవిష్యత్తు లేదన్నారు. అహంకారానికి అహంభావానికి ఒక హద్దు ఉంటుందనీ, ప్రజాయుద్ధ నౌక, పేదల గళం గద్దర్ ను గడీల ముందు నిలబెట్టిన గత పాలకులకు ఉరి శిక్ష వేసినా తక్కువేనని మండిపడ్డారు. రాష్ట్రం లో పదేండ్ల పాటు పేదల సొంతిటి కల నెరవేర లేదన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభు త్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ, రైతు రుణ మాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, మహిళ లకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ , ఇందిరమ్మ ఇండ్లు వంటి అంశాలను ప్రస్తావిం చారు. ప్రజలకు ఇవన్నీ ఇచ్చినందుకు ప్రజా ప్రభుత్వం పోవాలా అని అడిగారు. దొర అహం కారాన్ని మరోసారి బొందపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
మీ ఆశీర్వాదమే..
‘జెడ్పీటీసీ మొదలుకొని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నానంటే అది ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదమే. 2006 జులై 4న మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. ఈ ప్రాంత ప్రజలు నాటిన మొక్క ప్రస్తుతం మహా వృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచింది. దీనికి ఈ మండల ప్రజల దీవెనలే అందుకు కారణం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 2029లో రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే తమ లక్ష్యమన్నారు. మిడ్జిల్, కల్వకుర్తి ప్రాంతాలకు గతంలోనూ గొప్ప గొప్ప నాయకులు ఉన్నారని చెప్పారు. ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్‌రెడ్డి రాజకీయంగా ఎదగడానికి తోడ్పడిన ద్యాప గోపాల్ రెడ్డి ఈ మిడ్జిల్ బిడ్డేనని చెప్పారు. అందుకే రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పాటు ద్యాప గోపాల్‌రెడ్డి విగ్రహాలను ఇక్కడ ఆవిష్కరించుకున్నామన్నారు.రాష్టానికి తొలి సీఎంగా పని చేసిన బూర్గుల రామకృష్ణారావు మహబూబ్‌నగర్ బిడ్డేనని చెప్పారు. మిడ్జిల్, గట్టు మండలాలను ఆనాడు డార్క్ మండలాలుగా ప్రకటించారని గుర్తుచేశారు. మిడ్జిల్ మండలాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని చెప్పారు.
ఆర్థికమంత్రి దత్తత తీసుకోవాలి
మిడ్జిల్ మండలాన్ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క దత్తత తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. ఆ మండలానికి కావల్సిన అన్ని అభివృద్ధి పనుల్ని ఆయనే స్వయంగా చూసుకోవాలని ఆకాంక్షించారు. ఈ మండలం జిల్లాలోనే ఆదర్శంగా నిలవాలనేది తమ కోరిక అన్నారు. పేదల సమస్యలు తెలిసినవాడిగా పరిష్కారాలు చూపిస్తానని తెలిపారు.
అధికార దుర్వినియోగం చేయలేదు
తాను ఏనాడూ పదవి, అధికారాన్ని దుర్వినియోగం చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2034 వరకూ రాష్ర్టంలో కాంగ్రెస్‌దే అధికారమని పునరుద్ఘాటించారు. దానికి తెలంగాణ ప్రజలు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ మల్లురవి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేంద ర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరుద్‌రెడ్డి, కసిరెడ్డి నారాయ ణరెడ్డి, కూచుకుళ్ళ రాజేష్‌రెడ్డి, ఈర్లపల్లి శంకర్, మధుసూదన్ రెడ్డి, వంశీకృష్ణ, నవీన్ యాదవ్, రామ్మోహన్ రెడ్డి, మేఘా రెడ్డి, నాయకులు శివసే నారెడ్డి, సరితా, తిరుపతయ్య, సంజీవ్ ముదిరాజ్ , ఒబేదుల్లా కోత్వాల్ తదితరులు పాల్గొన్నారు.
అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు
నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట ఆంజనేయస్వామి దేవాలయం అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేశామని, ఆలయాన్ని అన్ని అభివృద్ధి చేసేందుకు తాము సానుకూలంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. అనంతరం సీఎం తన రాజకీయ ప్రస్థానంలో మొట్టమొదటగా ఊరుకొండ, మిడ్జిల్ ఉమ్మడి మండలంలో 2006లో జెడ్పీటీసీగా గెలిచిన సమయంలో సహకరించిన మిత్రుల్ని కలుసుకున్నారు.
కేసీఆర్‌కు వేల ఎకరాలు ఎలా వచ్చాయ్?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



