సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
భువనగిరిలో దొడ్డి కొమురయ్యకు నివాళి
6న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద వామపక్షాల మహాధర్నా
విజయవంతం చేయాలని పిలుపు
గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న కొత్త ధనిక వర్గ ఆధిపత్యం : వెంకట్
నవతెలంగాణ-
నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
దొడ్డి కొమురయ్య నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చారిత్రాత్మక ప్రజా ఉద్యమమని, ఆ స్ఫూర్తితోనే నేడు దోపిడీ శక్తులపై పోరాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సీపీఐ(ఎం) యాదాద్రిభువనగిరి రాజకీయ శిక్షణా తరగతుల సందర్భంగా శనివారం భువనగిరిలో దొడ్డి కొమురయ్యకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ప్రజలకు లభించిన హక్కులు, సామాజిక పురోగతి దొడ్డి కొమరయ్య లాంటి అమరవీరుల త్యాగాల ఫలితమేనని చెప్పారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో నేడు మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ దోపిడీ, ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరిచే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కీలక బాధ్యత అన్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు, నిరుద్యోగులకు ఉద్యోగాల హామీలు వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలు లేని ప్రతి పేద కుటుంబానికీ 120 గజాల స్థలం కేటాయించి, గుడిసెలు వేసుకుని నివసిస్తున్న కుటుంబాలన్నింటికీ శాశ్వత పట్టాలు ఇవ్వాలని కోరారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులందరికీ పట్టా పాసుబుక్కులు జారీ చేయడంతో పాటు పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. రాష్ట్రంలో వేలాది పేద కుటుంబాలు ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న గృహ, ఉపాధి, జీవన వ్యయ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఆధిపత్యం పెరుగుతోంది: వెంకట్
పాత జమీందారీ వ్యవస్థ రూపం మారినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ధనిక వర్గం ఆధిపత్యం పెరుగుతోందని వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. గ్రామాల్లో సుమారు 30 శాతం భూములు 20 శాతం కుటుంబాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయని చెప్పారు. మద్యం వ్యాపారం, వడ్డీ వ్యాపారాలు, యంత్రాల యాజమాన్యం, విద్యా సంస్థలు, కాంట్రాక్టులు వంటి రంగాలన్నిం టిపైనా అదే వర్గం ఆధిపత్యం కొనసాగుతోందని వివరించారు. గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, చిన్న, సన్నకారు రైతులందరినీ సంఘటితం చేసి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలను బలోపేతం చేయడం సీపీఐ(ఎం) ప్రధాన రాజకీయ కర్తవ్యమని స్పష్టం చేశారు.
దోపిడీ శక్తులపై పోరాడుదాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



