Monday, May 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రాణహితపై ఎలా ముందుకెళ్దాం?

ప్రాణహితపై ఎలా ముందుకెళ్దాం?

- Advertisement -

• బీఆర్ఎస్ హయాంలో 148 మీటర్లకు అంతర్రాష్ట్ర ఒప్పందం
• తాజాగా 150 మీటర్ల ఎత్తుకు మొగ్గు
• క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రుల బృందం
• మహారాష్ట్ర ఒప్పుకుంటేనే ప్రాజెక్ట్ ముందుకు

​ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నీటి లభ్యత లేదనే సాకుతో బీఆర్‌ఎస్ సర్కార్ పక్కన పెట్టిన ఈ బ్యారేజ్‌ను నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టింది. 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే తెలంగాణకు పెద్దగా ప్రయోజనం ఉండదనీ, 150 మీటర్ల ఎత్తులో చేపట్టాలని ఏప్రిల్ 2న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు చొరవ చూపి మహారాష్ట్రను ఒప్పించాలనీ, ముందుండి నడిపించే బాధ్యతను మంత్రి ఉత్తమ్‌కు అప్పగించారు. ఈ క్రమంలో తాజాగా మంత్రులు జూపల్లి, వివేక్ వెంకటస్వామి ప్రాజెక్ట్ నిర్మించే తుమ్మిడి హట్టి ప్రాంతాన్ని సందర్శించి వాస్తవ పరిస్థితిని పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎత్తు విషయంలో పక్క రాష్ట్రం ఒప్పు కుంటేనే ప్రాజెక్ట్ ముందుకు సాగనుంది.

​నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ను కొమరంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించింది. 2008 నవంబర్‌ 19న శంకుస్థాపన చేశారు. ప్రాణహిత నది నుంచి 160 టీఎంసీల నీటిని సాగు, తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవాలని నిర్ణయించారు. వార్ధా, పెన్‌గంగ నదులు సంగమించి ప్రాణహిత నదిగా రూపొందే స్థలం వద్ద ఈ బ్యారేజీకి రూప కల్పన చేశారు. 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 1.8 టీఎంల నీరు నిల్వ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సిర్పూర్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ప్రాజెక్ట్‌ స్థలాన్ని 200 మీటర్లు ఎగువన జరిపి వార్ధా నదిపై నిర్మించాలనే అంశాన్ని సైతం రేవంత్‌రెడ్డి సర్కార్ పరిశీలిస్తోంది. తుది డీపీఆర్‌ ‌వస్తే గాని నిర్మాణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ముంపును తగ్గించడంతో పాటు నిర్దేశించిన స్థాయిలో గరిష్ట నీటిని వినియోగించు కునేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. గతంలో జరిగిన చర్చల ప్రకారం సముద్ర మట్టానికి 148 మీటర్ల ఎత్తున నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించింది. 152 మీటర్ల ఎత్తు నిర్మిస్తే ఆ రాష్ట్రం పరిధిలో ముంపు ప్రభావం ఎక్కువగా ఉంటుందనీ, మధ్యేమార్గంగా 150 మీటర్ల ఎత్తులో నిర్మించాలని సర్కార్ భావిస్తోంది. తక్కువ ఖర్చుతో గ్రావిటీపై శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ కు నీటిని తరలించే వీలుంటుంది.

మహారాష్ట్రను ఒప్పిస్తేనే ముందుకు
మహారాష్ట్ర ఒప్పు కుంటేనే తుమ్మిడి హట్టి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. అయితే గత ప్రభుత్వం 2016లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 148 మీటర్ల ఎత్తులో కాకుండా 150 ఎత్తున నిర్మించాలని రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల మహారాష్ట్ర సానుకూలంగా లేదని తెలుస్తోంది. పక్క రాష్ట్రం నిర్మించే ప్రాజెక్ట్ వల్ల తమ రైతులు భూముల కోల్పోవడాకి ఒప్పుకోవడం లేదు. దాంతో రాష్ట్రాఁకి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలను రంగంలోకి దింపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో పాటు ప్రధాని మోడీకి లేఖలు రాశారు. త్వరలో సీఎం నేతృత్వంలోని మంత్రుల బృందం మహారాష్ట్రకు వెళ్లి చర్చలు జరపాలని నిర్ణయించింది.

​ముంపుపై భిన్నాభిప్రాయాలు
తుమ్మిడి హట్టి ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపు గురయ్యే భూములపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే కేవలం 300 ఎకరాల వరకు భూములు ముంపుకు గురవుతాయనే విషయంలో ఇంజినీర్లు, నీటి పారుదల రంగ నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు లేదు. 150 మీటర్ల ఎత్తులో మాత్రమే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. 1250 ఎకరాలు ముంపుకు గురవుతుందని కొందరు, 3 నుంచి 4 వేల ఎకరాల వరకు భూమి ముంపుకు గురయ్యే అవకాశం ఉందని మరి కొందరు చెబుతున్నారు. రాష్ర్ట ప్రభుత్వం కొత్తగా తయారు చేస్తున్న డీపీఆర్‌ ‌బయట కొస్తే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వినియోగంలోకి పాత కాలువలు
ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్ట్ కు సంబంధించి గత సర్కార్ రూ.11 వేల కోట్లు వ్యయం చేసి కాలువల నిర్మాణం చేసింది. 106 కిలో మీటర్ల విస్తీర్ణంలో కెనాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయగా, 71.5 కిలో మీటర్ల మేర భూ సేకరణ చేశారు. 46 కిలో మీటర్ల కాల్వల నిర్మాణం పనులు పూర్తి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన బీఆరఎస్ ప్రభుత్వం ప్రాణహితను పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ పనులను చేపట్టింది. ప్రస్తుత సర్కార్ ఈ కాలువలను తిరిగి వినియోగంలోకి తేవాలని సంకల్పించిది. అందుకు తగ్గట్టుగా ప్రాజెక్ట్ కొత్త డీపీఆర్‌ను సిద్దం చేస్తోంది.

ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్ట్‌‌ను వెంటనే చేపట్టాలి
గత సర్కార్‌ ‌హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్ట్‌‌ను వెంటనే చేపట్టాలి. 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే కేవలం 1250 ఎకరాల భూమి మాత్రమే ముంపుకు గురువుతుంది. ఉమ్మడి అదిలాబాద్‌ ‌జిల్లాకు 1.56 లక్ష‍ల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుంది. తుమ్మిడి హట్టి నుంచి సూర్గపల్లి వరకు (28.5 కిలో మీటర్లు) లిఫ్ట్‌ ‌చేయాలి. 71.5 కిలో మీటర్ల వద్ద మైలారం ప్రాజెక్ట్‌ ‌చేపట్టాలి. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీరు చేరుతుంది. మేడిగడ్డ ఎత్తి పోతలతో పోల్చితే తక్కువ వ్యయంతో తెలంగాణకు సాగు, తాగు నీరందుతుంది. ప్రభుత్వం ఈ ప్రాజక్ట్‌‌ను చిత్త శుద్దితో పూర్తి చేయాలి.
సారంపల్లి మల్లారెడ్డి,
తెలంగాణ రైతు సంఘం, సీనియర్‌ ‌నాయకులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -