మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ ప్రణాళికను ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారనీ, విత్తనాలు సేకరించి పెట్టుకుంటున్నారని తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించడంలోనూ, పంటల సాగుపైనా అవగాహన కల్పించడంలోనూ వ్యవసాయ అధికారులు విఫలమయ్యారని ఎత్తిచూపారు. ఇప్పటికైనా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. 2014 నుండి నేటి వరకు విజిలెన్స్ శాఖ 1400 కల్తీ విత్తనాల కేసులను నమోదు చేస్తే ఒక్కరిపై కూడా పీడీ యాక్ట్ గానీ, లైసెన్సులు రద్దు చేయలేదని ఎత్తిచూపారు. నాసిరకం విత్తనాలు వాడటం వల్ల ఏటా ఐదారు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరుగుతోందని తెలిపారు. విత్తన చట్టం లేకపోవడం వలన కొంతమంది అధికారులు విత్తన కంపెనీలతో ములాఖాత్ అయి రైతులకు తీవ్రంగా నష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను అందించడం చేతగాకనే ప్రధాని మోడీ ఉచిత సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వకపోవడం వలన ప్రయివేటు, మైక్రో ఫైనాన్స్ లపై ఆధారాపడి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని వాపోయారు. బ్యాంకులు పంట రుణాల ప్రణాళికలు ప్రకటించాలనీ, రిజర్వ్ బ్యాంకు ఆదేశాల ప్రకారం రైతులందరికీ రుణాలివ్వాలని కోరారు. కౌలు రైతులందరికీ రుణ అర్హత కార్డులిస్తామనే హామీని రాష్ట్ర సర్కారు వెంటనే నెరవేర్చాలని కోరారు. పంటలను సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రోడ్లమీద,కల్లాల్లో రాశులు పోసుకొని రైతులు వారాలతరుబడి పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. గన్నీబ్యాగులు, లారీల కొరతను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించాలనీ, పెండింగ్లో ఉన్న రుణమాఫీ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన మూడు క్రాపుల నిధులను విడుదల చేయాలని కోరారు.
వ్యవసాయ ప్రణాళికను ప్రకటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



