Sunday, June 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహస్మత్‌పేటలో హైడ్రా ఆపరేషన్

హస్మత్‌పేటలో హైడ్రా ఆపరేషన్

- Advertisement -


రూ.750 కోట్ల ప్రభుత్వ భూమికి రక్షణ
నవతెలంగాణ – బాలానగర్

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బోయిన్‌పల్లి సర్కిల్ బాలానగర్ మండలం హస్మత్‌పేటలో శనివారం హైడ్రా భారీగా ఆక్రమణలను తలొగించింది. రెవెన్యూ అధికారుల లేఖ ఆధారంగా, వారి సమక్షంలో పోలీసుల కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో దాదాపు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి సుమారు రూ.750 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హస్మత్‌పేట సర్వే నంబర్–01లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, గతంలోనే దాదాపు 98 ఎకరాలు వివిధ ఆక్రమణలకు గురై నివాసాలు, భవనాల నిర్మాణాలు జరిగిపోయాయి. ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా, మిగిలిన ప్రభుత్వ భూమిని మాత్రమే రక్షించే లక్ష్యంతో హైడ్రా చర్యలు చేపట్టింది. మిగిలిన 10 ఎకరాల భూమిని కూడా ఆక్రమించేందుకు కొందరు కబ్జాదారులు ప్రీకాస్ట్ కాంపౌండ్ గోడలు నిర్మించి, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి, తమ మనుషులతో కాపలా పెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైడ్రా బృందాలు రంగంలోకి దిగి ప్రీకాస్ట్ గోడలు, తాత్కాలిక షెడ్లను యంత్రాల సహాయంతో పూర్తిగా తొలగించాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, రెవెన్యూ అధికారులు మొత్తం ప్రక్రియను పర్యవేక్షించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా ఆక్రమణలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -