ఒక జట్టులోని ఐదుగురు సభ్యులు సాయంత్రం వేళలో ఓరెస్టారెంట్లో కూర్చొని భోజనం చేస్తున్నారు. చల్లటి గాలి వీస్తోంది, ఆకస్మాత్తుగా సన్నటి వర్షపు జల్లు మొదలై భారీ వర్షంగా మారింది. ఆ ఐదుగురిలో ఆ జట్టు నాయకుడు కూడా ఉన్నాడు. అతడు మనసులో ఈ నలుగురికి ఓ పాఠం నేర్పుతానని అనుకుంటాడు.
‘నలుగురు చేతులు కడుక్కొని నా వద్దకు రండి ఓ ఆట ఆడుకుందాం’ అంటాడు. వారు చేతులు శుభ్రం చేసుకోవడానికి వెళ్తారు. జట్టు నాయకుడు టేబుల్‌పైన కొన్ని వస్తువులు ఏర్పాటు చేశాడు. అందులో చెంచా, గ్లాసు, మగ్గు, బకెట్ ఉన్నాయి. ఈ లోపు నలుగురు చేతులు శుభ్రం చేసుకొని నాయకుడి వద్దకి వచ్చారు. నాయకుడితో ఇప్పుడు మేం ఏం చేయాలో చెప్పమని అడుగుతారు. వారి మాటలు విన్న నాయకుడు టేబుల్ మీద ఉన్న ఆ నాలుగు వస్తువులను చూయించి వాటిని తీసుకొని బయట కురుస్తున్న ”వర్షాన్ని” అందులో నింపుకొని రండి అంటాడు. ఆ నలుగురు ఆ నాలుగు వస్తువులు తీసుకొని వర్షంలోకి వెళ్ళిపోయారు. వారి వద్ద వున్న వస్తువులతో కురుస్తున్న వర్షాన్ని అందులో పట్టుకొవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో చెంచా పట్టుకున్న వ్యక్తి చేతిలో ఉన్న చెంచా వర్షపు నీళ్ళతో నిండిపోయింది. అతడు నాయకుడి వద్దకు వెళ్ళి పోతాడు. రెండవ వ్యక్తి గ్లాసు నింపుకొని వెళ్తాడు. మూడవ వ్యక్తి మగ్గును నీళ్ళతో నింపుకొని వెళ్తాడు. నాల్గవ వ్యక్తి బకెట్నినీళ్ళతో నింపుకొని వెళ్తాడు.
ఆ నలుగురిని చూసి జట్టు నాయకుడు ఇలా అంటాడు. ఇప్పుడు మీకు రెండు విషయాలు నేర్పిస్తాను. అందులో మొదటిది ”వర్షం” నీళ్ళను ఒడిసి పట్టుకోవడం కోసం మీరు ఏ వస్తువులు ఐతే తీసుకొని వెళ్ళారో మీ వద్ద ఉన్న వస్తువులు చిన్నగా ఉన్నప్పటికి వర్షం మాత్రం ఒకే మోతాదులో కురుస్తోంది. మీరు చెంచా, గ్లాసులో, మగ్గులో, బకెట్లో ”నీరు” నింపుకొని వచ్చారు. వర్షం మాత్రం మీరు తీసుకొని వెళ్ళిన అన్ని వస్తువుల్ని, వాటి పరిమాణాన్ని బట్టి ”నీరు”నింపింది. మరి మీరు దేనిని దేనితో నింపాలనుకుంటున్నారు? ప్రకతి వద్ద ఇవ్వటానికి చాలా ఉంది. కానీ మీ వద్ద ఉన్న పాత్ర చాలా చిన్నగా ఉంటే ఇచ్చేవాడు మాత్రం ఏం చేస్తాడు అంటూ, ఇక రెండవ పాఠం నేర్చుకోండి. పెద్ద పాత్ర నింపడానికి మనకు ఎక్కువ ”సమయం” పడుతుంది.
ఎంత తక్కువ సమయంలో చెంచా ఐతే నీటితో నిండిందో అంతే సమయంలో బకెట్ నిండదు. కాబట్టి మీరు ఎక్కువగా నీరు నింపుకోవాలంటే వర్షంలో తడుస్తూ బకెట్ నింపుకోవడానికి నిరీక్షిస్తూ ఉండాల్సి ఉంటుంది. మీరు జీవితంలో గొప్పగా ఎదగాలంటే లేదా రాణించాలన్నా మీ ప్రయత్నాలు కూడా ఇలాగే ఉండాలి. అందులో వచ్చే ఆటుపోట్లను తట్టుకొని నిలబడాలి. అలా ఐతేనే మీరు ”విజయం” సాధిస్తారు. లేనిపక్షంలో ఓటమిని చవి చూడాల్సి ఉంటుంది. ఈ ప్రకతిలో చాలా ఉన్నాయి. మీరు తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే ”ప్రకతి” మీకు ఏమీ ఇవ్వదు. మీరు మీ ఇంటి నాలుగు గొడల మధ్య కూర్చోని ఏదో సాధించాలనుకుంటే ఏది సాధ్యం కాదు. ”మీ ఆలోచనలు నీటి ప్రవాహం మాదిరిగా పరుగులు తీస్తే ఏదైనా సాధ్యమే”. అదే నీరు ఒక చోట ఆగిపోతే అందులో బ్యాక్టీరియా, వైరస్ పోగవుతుంది. మన ”మెదడు” కూడా అంతే, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో దానికి పని కల్పిస్తే సమాధానం కూడా అంతే వేగంగా ఇస్తుంది. మీరు దానికి ఏ పని చెప్పకపోతే మీ మెదడు గూడుకట్టుకొని స్తబ్దంగా ఉండిపోతుంది.
చివరగా ఒక ప్రశ్న వేస్తాను.. మీ ఇంటి పరిసరాలలో ఉన్న చెట్టు ఎంతగా ఎదుగుతుందో చూడండి. అది ఎంతగా అంటే దాని చివరిస్థాయి వరకు ఎదుగుతుంది. మధ్యలో దాని పెరుగుదల ఆగదు. వక్షం ఎంత విశాలంగా విస్తరించినా దాని వేర్లు భూమిలో అంతే విశాలంగా విస్తరిస్తాయి. అవి దానికి కావలసిన బలాన్ని ఇస్తాయి. అలాగే ఒక వక్షం ఎన్ని పండ్లను ఇస్తుందో అన్నే ఇస్తుంది. అంతేకాని స్థాయికి తక్కువగా ఎట్టి పరిస్థితుల్లోను ఇవ్వదు. ఇక మీరు ఎంత మేరకు మీ లక్ష్యం పట్ల శ్రద్ధపెట్టాలనుకుంటున్నారో అంత మేరకు పెడ్తున్నారా? ఒకవేళ మీరు అలాంటి శ్రద్ధపెడితే మీకు ”ఆశీస్సులు”, ఒకవేళ పెట్టకపోతే ఆలోచించండి? లేవండి ఇంకా శ్రమించండి.
ఎలాంటి పనిని మీరు చేయాలంటే.. మీరు చేసే పనికి మీ మీద నమ్మకం కలిగేలా మసలుకోవాలి. సింహంతో ఉంటే జీవితంలో పోరాడటం నేర్పిస్తుంది. అలాకాక గాడిదతో ఉండాలనుకుంటే అది పరిస్థితులతో పాటు లొంగిపోయే అలవాటు నేర్పుతుంది. ఓటమి కేవలం ఒక క్షణం మాత్రమే ప్రభావితం చేస్తుంది. సంకల్ప బలం ఉన్న వారికైతే అది పెద్దగా ప్రభావం చూపదు. వెంటనే మీరు ఆ ఓటమి నుండి తేరుకొని భయటపడి మళ్ళీ ప్రయత్నాలు చేస్తారు. కొద్దిమంది మాత్రం అలాగే నిరాశకులోనై అందులోనే కూరుకొనిపోతారు. ఆ సమయంలో మీరు ఎవరి ఓదార్పుల కోసం ప్రయత్నించవద్దు. పరిస్థితులు అన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. కాస్తా నిరీక్షిస్తే… ఈ కథ మీ జీవితంలో విశేషమైన ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నాను.
– డా||మహ్మద్ హసన్,
9908059234



