Sunday, June 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవ్యవసాయ రంగంపై ఎల్ నినో ఎఫెక్ట్

వ్యవసాయ రంగంపై ఎల్ నినో ఎఫెక్ట్

- Advertisement -

రాష్ట్రంలో తగ్గిన సాగు విస్తీర్ణం
14.78 లక్షల ఎకరాల్లో సాగు
కేవలం 11.2 శాతం విస్తీర్ణంలోనే మొదలు
0.48 శాతానికి పరిమితమైన వరినాట్లు
17 జిల్లాల్లో లోటు వర్షపాతమే కారణం
ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక

హైదరాబాద్ :ఎల్నినో పరిస్థితులు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 1.32 కోట్ల ఎకరాల సాగుకు అనువైన భూమి ఉండగా, ఇప్పటివరకు రైతులు కేవలం 14.78 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారని వ్యవసాయ శాఖ ప్రకటించింది. దీనికి భిన్నంగా గత ఏడాది ఇదే సమయానికి 28.38 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వర్షపాతం లోపం కారణంగా ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం సుమారు 13.60 లక్షల ఎకరాలు తక్కువగా ఉందని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక : నైరుతి రుతుపవనాల కదలిక సరిగ్గా లేకపోవడం వల్ల వర్షపాత లోపం ఏర్పడింది. ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం తగ్గింది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ఈ సీజన్‌లో వరి సాగు లక్ష్యం 62.47 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 30,243 ఎకరాల్లోనే నాట్లు పూర్తయ్యాయి. ఇతర పంటల వివరాలు ఇలా ఉన్నాయి. పత్తి 48.93 లక్షల ఎకరాలకు ఇప్పటివరకు 12.60 లక్షల ఎకరాలు సాగు చేయగా, మొక్కజొన్న 5.21 లక్షల ఎకరాలకు 30,932 ఎకరాలు సాగు చేశారు. కందులు 6.69 లక్షల ఎకరాలకు 55,500ల ఎకరాలు, సోయాబీన్ 4.20 లక్షల ఎకరాలకు 24 వేల 666 ఎకరాలలో సాగు చేశారు. జొన్నలు 3,992 ఎకరాలు సాగు చేశారు. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో వర్షపాత లోపం కనిపించగా 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా రంగారెడ్డి, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రుతుపవనాల సీజన్ ప్రస్తుత పరిస్థితికి సంబంధించి వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
రాష్ట్రంలో వర్షపాతం లోటు
ఈ సీజన్‌లో ఇప్పటివరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 101.3 మి.మీ కాగా 84.6 మి.మీ వర్షపాతం నమోదైంది. దీనివల్ల 16.5 శాతం లోటు ఏర్పడింది. సిద్దిపేట, హన్మకొండ జిల్లాలు గణనీయమైన వర్షపాత లోటును ఎదుర్కొంటుండగా, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, వరంగల్, మహబూబాబాద్, జనగాం, మేడ్చల్, జోగులాంబ గద్వాల్, యాదాద్రి వంటి జిల్లాలు పాక్షిక వర్షపాత లోటును ఎదుర్కొంటున్నాయి. గతంలో కన్నా భిన్నంగా చిరు జల్లులకే వానలు పరిమితం కావటంతో..రాష్ట్రంలో ఇంకా వాతావరణం చల్లబడలేదు. దీంతో సామాన్య, మధ్యతరగతి జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. అదిగో..ఇదిగో భారీ వర్షాైలు వస్తాయని వాతావరణ శాఖ చేస్తున్న ప్రకటనలు కూడా ఊరట కల్పించలేకపోతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -