ఆరు గ్రామాల రైతులకు రూ.ఐదు కోట్లు టోకరా
కన్నీరు మున్నీరవుతున్న అన్నదాతలు
నమ్మించి మోసం చేసిన వ్యాపారులు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
ఈసారి ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లలో ఆలస్యంతో రైతులు నెలల తరబడి కేంద్రాల వద్ద వేచి ఉండటం, కాంటాల్లో మోసాలు తదితర సమస్యల నేపథ్యంలో దళారులకు అవకాశం దొరికింది. ఈ సమయంలో వారి బుట్టలో పడిపోయిన రైతులు తీవ్రంగా నష్టపోయిన దాఖలాలు వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఉదంతమే నాగర్‌కర్నూల్ జిల్లా బిజనపల్లి మండలంలో జరిగింది. ఎనిమిది గ్రామాల్లో 200 మంది రైతుల నుంచి వరి ధాన్యం, మొక్కజొన్నలను కొనుగోలు చేసిన కొంతమంది వ్యాపారులు డబ్బులు ఇవ్వకుండా ఉడాయించారు. రైతుల నుంచి సుమారు రూ.5 కోట్ల విలువ చేసే ధాన్యం, మొక్కజొన్న పంటలను వ్యాపారులు కొనుగోలు చేశారు. 15 రోజుల్లోగా డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికి రూపాయి కూడా చెల్లించకుండా పరారయ్యారు. నమ్మకమైన వ్యక్తులుగా చలామణి అయిన ఈ మోసగాళ్లు చివరికి అన్నదాతలను నిండా ముంచారు.
రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న వ్యాపారులు వారితో నమ్మకంగా మెలిగి ధాన్యం, మొక్కజొన్నలను భారీ మొత్తంలో కొనుగోలు చేశారు. మార్కెట్ ధర చెల్లిస్తామని, డబ్బులు సైతం 15రోజుల్లోగా ఇస్తామని చెప్పడంతో రైతులు నమ్మారు. ప్రభుత్వం పంటల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేయడం, డబ్బులు కూడా ఆలస్యమవుతుండటంతో అరవింద్, శివాజీ అనే వ్యాపారులు చెప్పింది నమ్మామని రైతులు వాపోయారు. ముందుగా కొంత అడ్వాన్స్ ఇస్తామని చెప్పి దాదాపు 200 మంది రైతుల వద్ద నుంచి సుమారు రూ. 5 కోట్ల విలువైన వరి పంటను సేకరించారు. మమ్మాయిపల్లి, మంగనూరు, వెల్గోండ, లట్టుపల్లి,వడ్డెమాన్, అల్లీపూర్‌షాయిన్‌పల్లి, బిజనపల్లి గ్రామాల రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. వరి క్వింటా రూ.2400, మొక్కజొన్న క్వింటా రూ.1800 ఖరీదు చేశారు. కొనుగోలు చేసిన సమయంలో రైతులకు15 రోజులకు డబ్బులు ఇస్తామని చెప్పారు. 15 రోజులకు అడిగితే మరో పది రోజుల సమయం అడిగారు. ఆ తర్వాత వ్యాపారులైన అరవింద్, శివాజీ దగ్గరకు వెళ్లగా.. అప్పటికే వారు పరారయ్యారు. ఇంకా చుట్టుపక్కల అనేక గ్రామాల్లోనూ ఆ వ్యాపారులు పంటలను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 22న డబ్బులు ఇస్తామని చెప్పిన వ్యాపారులు కనబడకపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. సరుకు అంతా తరలించి, రవాణా పూర్తయ్యాక డబ్బులు చేతికి అందజేస్తామని చెప్పి.. మొబైల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేసి, రాత్రికి రాత్రే ఉడాయించారు. దీంతో రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
అధికారుల వైఫల్యం వల్లే..
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆలస్యం కావడమేగాక తాలు, తేమ పేరుతో వారాల తరబడి నిరీక్షించలేక రైతులు ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు రైతులను నిలువునా ముంచుతున్నారు. వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యారని రైతు సంఘాల నాయకులు అంటున్నారు.
దళారీ వ్యాపారులను పట్టుకోవాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు, నాగర్‌కర్నూల్
ప్రభుత్వం స్పందించి పరారీలో ఉన్న దళారులను పట్టుకోవాలి. లేని పక్షంలో రైతాంగం చేసిన అప్పులు తీరే దారి లేక ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది. మోసపోయిన ప్రతి రైతుకూ న్యాయం జరిగేలా చూడాలి.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి
రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దు. ప్రభుత్వ మార్కె ట్‌కు ధాన్యం తీసుకొచ్చి సరైన గిట్టుబాటు ధర పొందాలి. ప్రయివేటు వ్యాపారుల మాయ మాటలు నమ్మి కష్టాలు పడొద్దు. సదరు వ్యాపారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయి.
-మార్కెట్ చైర్మెన్ రమణరావు,
నాగర్‌కర్నూల్ జిల్లా
మాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి
ప్రభుత్వం వరి కొనుగోలులో ఆలస్యం చేయడం వల్లే మేము ప్రయివేటుకు అమ్ముకోవాల్సి వచ్చింది. మేము మోసపోవడానికి కారణం ప్రభుత్వమే. మాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి.
యాదయ్య, వెల్గోండ గ్రామం. బిజనపల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
అప్పులోళ్లు వెంటపడుతున్నారు
సాగు పెట్టుబడికి అప్పులు చేసి పంటలు పండించా. ఇప్పటి వరకు కోత కోసిన హార్వెస్టర్‌కు ట్రాక్టరు కిరాయి కూడా ఇవ్వలేదు. పిండి సంచులు ఇతర ఖర్చుల కోసం మిత్తికి తెచ్చాను. వ్యాపారులను నమ్మి ధాన్యం అమ్మాను. రూ.రెండు లక్షలు రావాల్సి ఉంది. అప్పు ఇచ్చిన వారు వెంటపడుతున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలి.
-కోటమ్మ, వడ్డెమాన్ గ్రామం- బిజనపల్లి మండలం



