వ్యవసాయ మంత్రిగా శివరాజ్‌ చౌహన్‌ వద్దు

వ్యవసాయ మంత్రిగా శివరాజ్‌ చౌహన్‌ వద్దు– నియామకాన్ని వ్యతిరేకించిన ఎస్కేఎం, ఏఐకేఎస్‌
న్యూఢిల్లీ : కేంద్రంలోని ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ, రైతు సంక్షేమం శాఖలను 2017లో ఆరుగురు రైతుల హత్యలకు బాధ్యుడైన శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌కు కేటాయించడాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం), అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) తీవ్రంగా వ్యతికేకించాయి. ఈ మేరకు వేరువేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ఎస్కేఎం తన ప్రకటనలో ‘కనీస మద్దతు ధర, రుణమాఫీ కోసం, దేశంలో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు వ్యతిరేకించగా మధ్యప్రదేశ్‌లో 2017 జూన్‌ 6న ఆందోళన చేస్తున్న సమయంలో ఈ రైతులను హత్య చేశారు’ అని తెలిపింది.
దేశంలో వ్యవసాయ సంక్షోభం కారణంగా ప్రతిరోజూ 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించడంలో ఎన్డీఏ ప్రభుత్వం మొదటి క్యాబినేట్‌ సమావేశం విఫలమైందని, రైతులకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎస్కేఎం విమర్శించింది. కనీస మద్దతు ధర కోసం సి2 ప్లస్‌ 50 పర్సెంట్‌ ఫార్ములాపై హామీ, రుణాల మాఫీ, విద్యుత్‌ ప్రయివేటీకరణ రద్దు, ఉత్పత్తి వ్యయం తగ్గింపు, బీమా-పెన్షన్‌ హామీ వంటి పెండింగ్‌లో డిమాండ్లపైనా, ప్రతీ రైతు కుటుంబానికి సగటు నెలకు రూ 500 చొప్పున అందచేసే ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధికి సంబంధించిన బకాయిలు రూ. 20 వేల కోట్లు విడుదల వంటి అంశాలపై ఎన్డీఏ క్యాబినెట్‌ ఎలాంటి నిర్ణయాలను ప్రకటించలేదని పేర్కొంది.
తాజా లోక్‌సభ ఎన్నికల్లో 159 గ్రామీణ నియోజకవర్గాల్లో ఓటమి నుంచి ఎన్డీఏ, బీజేపీ ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని ఈ వైఖరి స్పష్టం చేస్తోందని ఎస్కేఎం తన ప్రకటనలో తెలిపింది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే విధానంలో బీజేపీ ఎలాంటి మార్పులు చేస్తుందని రైతులకు ఏ విధమైన భ్రమలు లేవని ఎస్కేఎం పేర్కొంది. రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, చిన్న ఉత్పత్తిదారులు ఐక్యం కావాలని, దేశవ్యాప్తంగా మరో దశ ప్రజా ఉద్యమాలకు తమను తాము సిద్ధం చేసుకోవాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది. ప్రజల మధ్య ఐక్యతను నిర్మించడానికి ఎస్కేఎం కట్టుబడి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతర పరిస్థితులను అంచనా వేయడానికి ఎస్కేఎం జనరల్‌ బాడీ సమావేశం జూలై 10న న్యూఢిల్లీలో నిర్వహించనున్నట్లు, వివిధ నిర్ధిష్ట డిమాండ్లపై భవిష్యత్‌ కార్యచరణను జనరల్‌ బాడీ పరిశీలిస్తుందని తెలిపింది. అలాగే ఈ ప్రకటనలో బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్‌ను మహిళా సెక్యూరిటీ గార్డు చెంప దెబ్బ కొట్టడం సమర్థనీయం కాదని ఎస్కేఎం తెలిపింది. అయితే చారిత్రాత్మక రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా కంగనా రనౌత్‌ అహంకారపూరిత, దురుద్దేశపూరిత ప్రకటనలను ఎస్కేఎం విమర్శించింది.
కాగా, చౌహాన్‌ను వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించడాన్ని ఏఐకేఎస్‌ కూడా ఖండించింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో మధ్యప్రదేశ్‌లో మందసౌర్‌లో జరిగిన ఘటనకు చౌహన్‌ బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. 17వ విడత పీఎం కిసాన్‌ నిధిని విడుదల చేయాలనే కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాన్ని కేవలం కంటి తడుపు చర్యగా అభివర్ణించింది. 159 గ్రామీణ నియోజకవర్గాల్లో ఓటమి చెందినా బీజేపీ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని విమర్శించింది.

Spread the love