నవతెలంగాణ – హైదరాబాద్: తన సొంత నియోజకవర్గమైన కోడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన కోడంగల్ చేరుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ..తన రాజకీయ ప్రస్థానంలో కొడంగల్ కార్యకర్తల త్యాగాలు మరువలేనివని అన్నారు. కృష్ణా జలాలతో కోడంగల్ భూములను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. కోడంగల్ లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుపతి తరహాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య అవసరాల కోసం 430 పడకల భారీ ఆస్పత్రిని త్వరలోనే నిర్మిస్తామని అన్నారు.
ఒకప్పుడు చదువు కోసం పక్క ఊర్లకు వెళ్లే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మెడికల్, ఇంజనీరింగ్, నర్సింగ్ కాలేజీలతో పాటు సైనిక్ స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు అవుతున్నాయని వెల్లడించారు. అలాగే, లగచర్ల వద్ద 2,300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, రాబోయే ఆరు నెలల్లో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. వికారాబాద్ రైల్వే లైన్ పనులు 90% పూర్తయ్యాయని, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కొడంగల్ వరకు భారీ రహదారిని నిర్మిస్తున్నామని ఆయన వివరించారు.
2009లో మీరు నాటిన మొక్క నేడు చెట్టుగా మారిందని, ఆ చెట్టును మీరే కాపాడుకోవాలన్నారు. 2027 డిసెంబర్ నాటికి కొడంగల్‌లో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి, నియోజకవర్గాన్ని బంగారు తునకగా మారుస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ నిశ్చయం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



