సెమీస్‌ రిజర్వు డేలకు ఐసీసీ ‘నో’

సెమీస్‌ రిజర్వు డేలకు ఐసీసీ 'నో'– వర్షంతో రద్దయితే రన్‌రేట్‌ ప్రాతిపదికన
– టై అయితే సూపర్‌ ఓవర్‌తో ఫలితం
– టి20 ప్రపంచకప్‌
దుబాయ్: వెస్టిండీస్‌, అమెరికా వేదికలుగా జరిగే టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) స్పష్టతనిచ్చింది. రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వు డేలను కేటాయించడం లేదని స్పష్టం చేసింది. అనివార్య కారణాలవల్ల సెమీఫైనల్స్‌ మ్యాచ్‌లు నిలిచిపోతే అవసరమైతే 250 నిమిషాలు(సుమారు 4గంటలు) తర్వాత అయిన మ్యాచ్‌ను కొనసాగిస్తామని తెలిపింది. అంతేగాని సెమీస్‌ మ్యాచ్‌లను మరుసటిరోజుకు వాయిదా వేసే ప్రసక్తి లేదని పేర్కొంది. మ్యాచ్‌లను మరుసటిరోజుకు వాయిదా వేయడం వల్ల ఫైనల్లో ఆడే ఆటగాళ్లు ఇబ్బందులు పడతారని తెలిపింది. సెమీస్‌ ముగిసిన మరుసటిరోజే ఆ జట్టు ఫైనల్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుందని అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఒకవేళ సెమీస్‌ మ్యాచ్‌ టై అయిన పక్షంలో నిబంధనల ప్రకారం సూపర్‌ ఓవర్‌ ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తామని, వర్షం కారణంగా మ్యాచ్‌ పూర్తిగా రద్దయిన పక్షంలో రెండో లీగ్‌ పోటీలు ముగిసిన తర్వాత మెరుగైన రన్‌రేట్‌ కలిగి మొదటిస్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌కు చేరందని ఆ ప్రకటనలో తెలిపింది. ఐసిసి టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌ జూన్‌ 27న ట్రినిడాడ్‌, గయానా వేదికలుగా జరగనున్నాయి. జూన్‌ 28న ట్రావెల్‌ డేగా, 29న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్నట్లు ఐసిసి తెలిసింది.

Spread the love