కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధుకు రాంరాం

If Congress wins Let's come to Rythubandhu– ప్రజాస్వామ్యాన్నే కొంటారట..!
– మాటలు మార్చేటోళ్లకు ఓటేస్తే ప్రజలు ఓడుతారు..
– ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తుమ్మలకు మంత్రి పదవిచ్చా..
– కమ్యూనిస్టులు పాలించిన చైతన్యవంత ప్రాంతం ఇదీ..
– ఎవరి వైఖరేంటో తెలుసుకుని ఓటేయాలి..
– ప్రధాని రాష్ట్రంలోనూ 24 గంటల కరెంటు లేదు..
– ఉపేందర్‌రెడ్డిని గెలిపిస్తే పాలేరు మొత్తానికి దళితబంధు : ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి/ మహబూబాబాద్‌
”కాంగ్రెస్‌ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. కైలాసం వైకుంఠపాళి ఆటలో పెద్దపాము మింగినట్టే..! పదవుల కోసం పార్టీలు మారుతున్నారు.. జిల్లాలో నాయకులు డబ్బుల అహంకారంతో మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టు ఎమ్మెల్యేల ఏలుబడిలో చైతన్యవంతమైన ప్రాంతం ఇదీ.. మాటలు మార్చేటోళ్లకు ఓట్లేస్తే ప్రజలు ఓడుతారు.. డబ్బు మదంతో ప్రజలను, ప్రజాస్వామ్యాన్నే కొంటామం టున్నారు. తుమ్మల ఎమ్మెల్యేగా ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే నేను ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవిచ్చా…” అంటూ కాంగ్రెస్‌ నేతలపై ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. ప్రధాని మోడీ స్వరాష్ట్రంలోనూ 24 గంటల కరెంటు లేదని, సాగుకు, పరిశ్రమలకు 24 గంటలపాటు కరెంటునిచ్చేది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌, వర్ధన్నపేట పాలేరు నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. పాలేరు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యరి కందాల ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కూమసుంచి మండలంలోని జీళ్లచెరువు వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. కందాల ఉపేందర్‌రెడ్డిని అసెంబ్లీ వాకిలి దాటిస్తే పాలేరు నియోజకవర్గం మొత్తానికి దళితబంధు అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కోట్లు, నోట్లు పెట్టుకొని వచ్చేటోడు ఏమి చేయడు..? సంక్షేమ, అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్‌ అన్నారు. ఈ పథకాన్ని వ్యవసాయ నిపుణులు స్వామినాథన్‌, ఐక్యరాజ్యసమితి ప్రశంసించాయని గుర్తు చేశారు. కానీ రైతుబంధు దుబారా..!, వేస్టు అని మాజీ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటుంటే.. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షులు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్‌ చాలంటున్నారు.. ఇది కరెక్టేనా అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టు నీళ్లు వస్తే కరువు తొంగిచూడదన్నారు. ఇన్నాళ్లు ఎవరైనా దళితబంధు ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. ప్రతి తండాను పంచాయతీని చేయడంతో వాళ్ల తండాల్లో వాళ్లే రాజ్యం చేస్తున్నారని చెప్పారు. గిరిజనులకు పోడుపట్టాలు పంపిణీ చేసి, వాళ్లపై పెట్టిన కేసులు ఎత్తివేశామన్నారు. అలాంటిది కాంగ్రెస్‌ నాయకులు రూ.వెయ్యి ఇచ్చి, గుడుంబా పోస్తే లంబాడోళ్లు ఓట్లు వేస్తారని గిరిజనులను చులకన చేసి మాట్లాడు తున్నారన్నారు. గత రెండు పర్యాయాలు ఖమ్మం జిల్లా ప్రాతినిధ్యం లేకుండానే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఈసారి అలాకాకుండా బీఆర్‌ఎస్‌ అన్ని స్థానాల్లో గెలిచేలా కృషి చేయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఇంటి మనిషిలా మీలో ఒక్కడిగా ఉన్న కందాల ఉపేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. సభలో బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్‌, దేశపతి శ్రీనివాస్‌, మధుసూదనాచారి, వైరా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌, ఎమ్మెల్యే రాములునాయక్‌ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామంలో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడారు. 24 గంటల కరెంటు కావాలన్నవాళ్లు చేతులు ఎత్తాలని ప్రజలకు చెప్పిన సీఎం.. కెమెరాలన్నింటినీ ఆ చేతుల వైపు తిప్పాలని కోరారు. రాష్ట్రంలో అధికారం కోసమే కాంగ్రెస్‌ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో వర్ధన్నపేటలో ఎస్సారెస్పీ కాలువల్లో చెట్లు మొలిచి అధ్వాన్నంగా ఉండేవని, ఇప్పుడు ఐనవోలు, హసన్‌పర్తి మండలాలకు దేవాదుల ప్రాజెక్టు నీరు తీసుకొచ్చామని తెలిపారు. రింగ్‌ రోడ్డు కోసం ల్యాండ్‌ పూలింగ్‌ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, అరూరి రమేష్‌ను నేరుగా ఓడించడం చేతకాని వాళ్లు చేస్తున్న పనని, ల్యాండ్‌ పూలింగ్‌ ఏమి ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫించన్‌ను మార్చి నెల అనంతరం సంవత్సరానికి రూ.500ల చొప్పున పెంచుతూ రూ.5,016కు పెంచుతామన్నారు. వచ్చే మార్చి తరువాత రేషన్‌కార్డులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉన్న 42 విలీన గ్రామాల్లో సాదాబైనామాలను రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఎన్నికల అనంతరం ఇస్తామని హామీనిచ్చారు. రైతు, సంక్షేమ రాజ్యాంగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దుకున్నామన్నారు. మంత్రి దయాకర్‌రావు, మాజీ మంత్రి కడియం శ్రీహరిలది కూడా వర్ధన్నపేట నియోజకవర్గమేనని, వారిద్దరి ఆశీస్సులు అరూరి రమేష్‌కు ఉన్నాయన్నారు. కాగా, సీఎం కేసీఆర్‌ ప్రసంగం సభికులను ఆకట్టుకోలేకపోవడంతో ప్రజలు తిరిగి వెళ్లిపోవడం గమనార్హం. దాంతో సభ 15 నిమిషాల్లోనే ముగించారు.
మహబూబాబాద్‌ జిల్లాలోని తొర్రూరు రహదారిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. ధరణి, రైతుబంధు వద్దంటున్న ఆ నలుగురు రాహుల్‌గాంధీ, ఉత్తమ కుమార్‌ రెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలను బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు. ఎవరో వచ్చారని ఏదో చెప్పారని, లీడర్‌ చెప్పారని, బామ్మర్ది చెప్పాడని ఓటు వేయ వద్దని, గాబరా పడొద్దని, గోల్‌మాల్‌ కావొద్దని ఆలోచించి ఓటు వేయండని, తెలంగాణను దళార్లపాలు పైరవీకార్ల పాలు చేయొద్దని, పనిచేసే ప్రభుత్వానికి పట్టంకట్టాలని కోరారు. రైతుబంధు 4000తో స్టార్ట్‌ చేసి భవిష్యత్తులో 16,000 ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశారని అన్నారు. సభలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఛీఫ్‌ విప్‌ దాస్యం వినరుభాస్కర్‌, శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ డాక్టర్‌ బండా ప్రకాశ్‌, మేయర్‌ గుండు సుధారాణి, వరంగల్‌ ఎంపీ దయాకర్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజ్‌ సారయ్య, ఎమ్మెల్యే నరేందర్‌, డీసీసీబీ చైర్మెన్‌ మార్నేని రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌ సభకు వెళ్తుండగా ట్రాక్టర్‌ బోల్తా మహిళా మృతి.. 10మందికిపైగా గాయాలు
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడి ఒక మహిళ మృతి చెందగా 10 మందికి పైగా గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గైగొల్లపల్లి గ్రామానికి చెందిన 20 మంది కేసీఆర్‌ సభకు ట్రాక్టర్‌పై బయలుదేరగా మార్గమధ్యలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి మండలంలోని నాన్‌ తండా దగ్గర రోడ్డు పక్కన ఉన్న వరి పొలంలో బోల్తా పడింది. ట్రాక్టర్‌ ట్రక్కు తిరగలపడటంతో వరి పొలంలో జనం కూరుకుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ట్రాక్టర్‌ను వెంటనే పైకి లేపి జనాలను బురదలో నుంచి ఒడ్డుకు తీసుకువచ్చారు. అల్లి అనసూర్య (55) అక్కడికక్కడే మృతి చెందింది. సుమారు 10 మందికి కాళ్లకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానికులు 108 ద్వారా ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
చనిపోయిన మహిళ కుటుంబానికి రూ. 50లక్షలు ఇవ్వాలి : పొంగులేటి
ట్రాక్టర్‌ బోల్తా పడి మహిళ మృతి చెందిన సంఘటన బాధాకరమని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో చైర్మెన్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటనకు సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నైతిక బాధ్యత వహించాలన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 50లక్షలు, గాయపడిన వారికి రూ. 10లక్షల చొప్పున పార్టీ తరుపున ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Spread the love