కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ఫార్మాను రద్దు చేయిస్తా

– ఫార్మాపై బీజేపీ ద్వంద వైఖరి
– ఫార్మాపేరుతో మేడిపల్లిలో రూ.40 కోట్ల కుంభకోణం
– ఫార్మాను అడ్డం పెట్టుకుని రూ. కోట్లు కాజేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు
– కౌలు రైతుల భూములపై కన్నేసిన ప్రభుత్వం
– కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి
నవతెలంగాణ-యాచారం

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఫార్మాను రద్దు చేయిస్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం యాచారం మండల కేంద్రంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాధిత రైతుల సభకు మండల పరిధిలోని మేడిపల్లి, కుర్మిద్ధ, సింగారం, తాడిపర్తి, నానక్‌నగర్‌ గ్రామాల రైతులు హాజర య్యారు. ఈ సభకు మద్దతుగా జాతీయ కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షులు ముదిరెడ్డి కోదండ రెడ్డి, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాంలు మద్దతు తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఫార్మాను రద్దు చేయాలని రైతులు రంగారెడ్డిని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఫార్మా బాధిత రైతులందరికీ కాంగ్రెస్‌ అండగా నిలబడుతుందన్నారు. ఫార్మా విషయంలో అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఈ ఫార్మా విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంభిస్తుందన్నారు. ఫార్మా భూ సేకరణ విషయంలో ఒక్క మేడిపల్లిలోనే రూ.40 కోట్ల కుంభకోణం జరిగిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మేడిపల్లిలో భూ కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. ఫార్మా విషయంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వానికి ఏజెంట్‌గా పని చేశారని తెలిపారు. ఫార్మాను రద్దు చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని కలిసినా కూడా పట్టించుకోలేదన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేయిస్తామని రైతులకు హామీనిచ్చారు. ఈ విషయాన్ని కూడా కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ఫార్మా రద్దు విషయాన్ని చేర్చేందుకు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని రైతులకు తెలియజేశారు. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఫార్మా బాధిత రైతులంతా మద్దతు ఇచ్చి, ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం రైతుల పక్షాన ప్రొఫెసర్‌ కోదండరాం ఫార్మాసిటీ రద్దు విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు మేనిఫెస్టోలో పెట్టాలని అడిగారు. కాంగ్రెస్‌ పార్టీకి టీజేఎస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ గెలుపు కోసం రైతులంతా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రాజశేఖర్‌ రెడ్డి, రమేష్‌, కాంగ్రెస్‌ నాయకులు ఈసీ శేఖర్‌ గౌడ్‌, లక్ష్మీపతి గౌడ్‌, ఒక్క కురుమ శివకుమార్‌, మాజీ ఎంపీపీలురాచర్ల వెంకటేశ్వర్లు, జ్యోతి శ్రీనివాస్‌ నాయక్‌, అమృత సాగర్‌, నాయిని సుదర్శన్‌ రెడ్డి, టీజేఎస్‌ నాయకులు నిరంజన్‌, సత్యం ఫార్మసిటీ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్‌, కనమోని గణేష్‌, ఫార్మాసిటీ బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love