Sunday, July 12, 2026
E-PAPER
Homeసోపతిశిలా రూపానికి కళ్ళొస్తే

శిలా రూపానికి కళ్ళొస్తే

- Advertisement -

అవునండీ! అవును !!
కడుపు కట్టుకుని ఇష్ట దైవానికి
సమర్పించిన ఆ వెండి ఇటుకలు,
భక్తితో దేవుడికిచ్చిన కానుకలు,
తమ లోపల తామే కుమిలిపోతున్నాయి.
గుడిని కాపాడాల్సిన హస్తాలే
దోపిడీదారులుగా మారిన వేళ,
పూజారుల కర్పూర హారతిలోనే ఇప్పుడు
గాయపడిన గుండెల కోత కనిపిస్తోంది!
కంచే చేనును మేసినట్టు జరిగిన
ఈ ద్రోహంతో-
నిరుపేదల రెక్కల కష్టం
నిస్సహాయంగా రోధిస్తోంది.
గర్భగుడిలోని చిమ్మచీకట్లు
దీపాలను వెలిగిస్తుంటే,
బయటి మధ్యాహ్నపు ఎండ వెలుతురులో
చీకటి రాజ్యం నడుస్తోంది!
వత్తి లేని దీపపుకుందుల వెనుక
దొంగలు నిశ్శబ్దంగా దాక్కున్నారు.
సొమ్ము కాజేసిన వారి అపవిత్ర హస్తాలలోనే
పూజా పళ్ళాలు వెలిగిపోతున్నాయి,
విలువలన్నీ ఇక్కడ అమ్మకపు సరుకయ్యాయి!
కాపాడాల్సిన వారే లూటీలు చేస్తుంటే
డబ్బులిచ్చిన భక్తులు నిశ్చేష్టులయ్యారు,
ఇది కాలం చూసిన నమ్మకద్రోహపు దృశ్యం!
భావోద్వేగానికి ప్రతిరూపమైన
బాల శిలా విగ్రహమేమో
ఏం చేయాలో తోచక,
దిక్కు తెలియని స్థితిలో తలుపులేసుకుని
అంతరంగంలోనే పచార్లు చేస్తున్నది.
అది తప్పు చేసినవారిని శిక్షించే సరియైన
కాలం కోసం వేచి చూస్తున్నదో లేదో గానీ,
మాట్లాడాల్సిన ‘అధికారం’ మాత్రం
తూ, తూ మంత్రాలు చదువుతూ
గమ్మున నోరుమూసుకుని కూర్చుంది!
ఆలయ గుమ్మాలకు అతుక్కున్న కళ్ళు
నిజాలను నిగ్గుతేల్చమని ప్రశ్నిస్తున్నాయి,
ధూప దీపాల పొగలో పవిత్రత ఆవిరై
ముక్కలైపోతోంది భక్తుల నమ్మకం మౌనంగా!
విరాళాలు ఇచ్చిన జనం
ఇప్పుడు పిడికిళ్ళు బిగిస్తున్నారు,
ఆ బిగిసిన నరాలే నిలదీస్తున్నాయి…
”మా నమ్మకపు విలువ ఇదేనా?” అని.
పవిత్రమైన విశ్వాసం
నిలువునా సమాధి అయిన వేళ,
ఆ దేవుడే పరధ్యానంలో ఉండిపోతే…
ఇప్పుడు అంతిమ దైవం భక్తుడి కన్నీరే!
– విల్సన్‌ రావు కొమ్మవరపు, 89754 35515

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -