అనంత సాగరం అనే అడవిలో పెద్ద పెద్ద కొండలున్నాయి. అందులో పాల దొనే, రాగి దోనే, చీకటి దోనె అనే మూడు గుహలున్నాయి. వాటిలో చాలా లోతున పవిత్ర జలం ఉన్నది. వాటిని అనునిత్యం కాపాడడానికి అడవి రాజైన సింహం మూడు ఏనుగులను నియమించింది.
ప్రతి రోజు అక్కడికి వచ్చే జంతువులు ఒక్కసారైనా గుహల లోనికి వెళ్లడానికి ప్రయత్నం చేసేవి. ఏనుగులు వాటిని వెళ్లకుండా చూసేవి. ప్రతి పౌర్ణమి రోజున మాత్రం ఏనుగులు గుహల లోనికి వెళ్లి పవిత్ర జలాలను తెచ్చి, వెన్నెల వెలుగులో అక్కడ సమావేశమైన అడవి జంతువులపై చల్లేవి. తమ జన్మ ధన్యమైనదని అవి సంతోషపడేవి.
ఒక రోజు గుహల దగ్గరికి మూడు ఎలుగుబంట్లు వచ్చాయి. గుహలలోకి వెళుతుండగా ”ఆగండి,అందులోనికి వెళ్లకూడదు. అక్కడ ప్రమాదమున్నది. ఇది సింహం ఆజ్ఞ” అన్నాయి ఏనుగులు. వాటికి కోపం వచ్చింది.
”సింహం చెబితే మేము వినాలా” అంటూ ఏనుగులను బెదిరించాయి. ఏనుగులు వెళ్లవద్దని బతిమాలినా పట్టించుకోకుండా అవి చీకటి గుహలోకి వెళ్లాయి.
కొద్దిదూరం వెళ్లగానే వాటికి ఏమి కనిపించలేదు. ఊపిరాడలేదు. వెనక్కి తిరిగి వచ్చేలోగా రాళ్ల మధ్య ఇరుక్కుని అరవడం మొదలెట్టాయి. వాటి అరుపులు విని ఏనుగులు లోపలికి వెళ్లి వాటిని రక్షించి, బయటికి తీసుకొచ్చాయి. సహ తప్పి పడిపోయిన వాటిపై రాగి దొనే, పాల దోనే నుంచి తెచ్చిన పవిత్ర జలాన్ని చల్లాయి. ఎలుగు బంట్లు లేచి తలొంచుకుని నిలబడినవి.
”అక్కడ ప్రమాదముందని తెలిసే మన కోసం రాజు గారు మమ్మల్ని కాపలా గా పెట్టారు. నిర్లక్ష్యం చేత, అహంకారంతో మా హెచ్చరికను లెక్క చేయకుండా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండండి. మంచి మాటలు చెబితే వినాలి” అన్నాయి ఏనుగులు. తమ ప్రాణాలు కాపాడిన ఏనుగులకు కతజ్ఞతలు చెప్పి ఎలుగుబంట్లు వెళ్లాయి.
– దుర్గమ్ భైతి, 9959007914