దంచికొడుతున్న వానలు: ఐఎండి హెచ్చరిక

నవతెలంగాణ – న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. వరదల కారణంగా ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో వర్షాల కారణంగా 11 మంది మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. తాజాగా బాదలీ ప్రాంత అండర్‌పాస్‌ వద్ద నిలిచిన నీటమునిగి ఇద్దరు బాలురు మృతిచెందగా, వోఖలా అండర్‌పాస్‌ నీటిలో స్కూటీతో చిక్కుకుపోయి దిగ్విజరుకుమార్‌ చౌధరీ (60) అనే వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ నగరానికి ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ హెచ్చరికను జారీ చేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. శనివారం కురిసిన భారీవర్షాలకు కాంగ్డా, కులు, సోలన్‌ జిల్లాల్లో రహదారులను మూసివేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ వద్ద సూఖీ నదిలో చాలా కార్లు కొట్టుకుపోయాయి. అస్సాంలో వరదల పరిస్థితి శనివారం మరింత దారుణంగా మారింది. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Spread the love