Saturday, August 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకౌలు రైతుల హామీల అమలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నైతిక బాధ్యత

కౌలు రైతుల హామీల అమలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నైతిక బాధ్యత

- Advertisement -

వారి పోరాటానికి నా మద్దతు : ప్రొఫెసర్‌ యోగేంద్ర యాదవ్‌
కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి…ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి
వారి హక్కుల కోసం పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం
రాష్ట్ర స్థాయి రౌండ్‌‌టేబుల్‌‌లో మేధావులు, రైతు సంఘాల నేతలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కౌలు రైతులకిచ్చిన హామీలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నైతిక బాధ్యత అనీ, వాటిని తక్షణమే సీఎం రేవంత్‌‌రెడ్డి నెరవేర్చాలని ప్రొఫెసర్‌ ‌యోగేంద్ర యాదవ్‌ కోరారు. కౌలు రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ, రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ‘కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి…వ్యవసాయ పథకాలను వర్తింపజేయాలి’ అనే అంశంపై రౌండ్‌‌టేబుల్‌ ‌సమావేశాన్ని నిర్వహించారు. దీనికి కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ కన్వీనర్‌ ‌ప్రొఫెసర్‌ డి.నర్సింహారెడ్డి అధ్యక్షత వహించగా, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి సమన్వయకర్తగా వ్యవహరించారు. డీబీఎఫ్‌ ‌నేత శంకర్‌ ‌రౌండ్‌‌టేబుల్‌ ‌సమావేశం ఉద్దేశాన్ని వివరించారు. సెప్టెంబర్‌‌లోగా సమస్యను పరిష్కరించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేయాలని తీర్మానించారు. యోగేంద్ర యాదవ్‌ ‌మాట్లాడుతూ…కౌలు రైతుల సమస్యలపై 2023 సెప్టెంబర్ 12న హైదరాబాద్‌లో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్‌లో తాను పీపుల్స్ జ్యూరీ సభ్యునిగా పాల్గొన్నానని గుర్తుచేశారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కౌలు రైతులను గుర్తించబోమని అన్న మాటల్ని హియరింగ్‌‌లో పలువరు చెప్పడాన్ని విన్నాననన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి రాగానే కౌలు రైతులకు గుర్తింపు కార్డులిస్తామనీ, వారికి కూడా పంట సహాయం అందజేస్తామని పీసీసీ అధ్యక్షులుగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్‌‌రెడ్డి బహిరంగ లేఖ ద్వారా ఇచ్చిన హామీని ప్రస్తావించారు. మూడేండ్లు కావస్తున్నా కౌలు రైతులు ఇంకా అదే పరిస్థితిలో ఉండటం పట్ల విచారం వ్యక్తం చేశారు. కౌలురైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కౌలు రైతులు రమాకాంత్ యాదవ్ (అదిలాబాద్‌), మొగులమ్మ, చాందీబాయ్‌ (సంగారెడ్డి), నర్సింహులు (యాదాద్రి), శ్రీనివాసులు, గిరి (వికారాబాద్), వెంకటేష్ (నల్లగొండ) మాట్లాడుతూ…సీజన్ ఆరంభంలో సబ్సిడీ యూరియా కొనుగోలు మొదలు సీజన్ ముగింపులో పంట విక్రయం వరకు ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్నీ పొందలేకపోతున్నామని వాపోయారు. భూ యజమానిపై ఆధారపడ్డ ఓటీపీ ఆధారిత విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటీపీ విషయంలో కొద్ది మంది భూ యజమానులు మాత్రమే సహకరిస్తున్నారని తెలిపారు. 2011 చట్టం ప్రకారం తమకు రుణార్హత కార్డులివ్వాలని కోరారు. ప్రొఫెసర్‌, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్లు డి.నరసింహారెడ్డి, జి.హరగోపాల్‌, జస్టిస్‌(‌రిటైర్డ్‌) ‌చంద్రకుమార్‌, విద్యాకమిషన్‌ ‌మాజీ చైర్మెన్‌ ఆకునూరి మురళి, సుకుమార్‌ ‌నారాయణ్‌, సంయుక్త కిసాన్‌ ‌మోర్చా రాష్ట్ర కన్వీనర్లు తీగల సాగర్‌, పశ్యపద్మ, జక్కుల వెంకటయ్య మాట్లాడుతూ…ఇచ్చిన హామీ ప్రకారం గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించాలని కోరారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో లేదనీ, పాలకుల విధానాలతో రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు సంక్షోభంలో ఉన్నారని వాపోయారు. కౌలురైతులను గుర్తించి సహాయం అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని నొక్కి చెప్పారు.

కేవలం పెట్టుబడులు, ఫ్యూచర్ సిటీ పైనే కాకుండా కౌలు రైతులు, ఇతర ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కౌలు రైతుల హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడుతామని ముక్తకంఠంతో ప్రకటించారు. సమావేశంలో బి.కొండల్‌, విస్సా కిరణ్‌, రమాకాంత్‌ ‌యాదవ్‌ (‌రైతు స్వరాజ్యవేదిక) సోమిడి శ్రీనివాస్‌ (‌తెలంగాణ రైతు సంఘం), ఈశ్వరమ్మ(తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్‌), తదితరులు మాట్లాడారు. కన్నెగంటి రవి భవిష్యత్ కార్యాచరణను వివరించారు. సెప్టెంబర్ రెండో వారం నాటికి ప్రభుత్వం గుర్తింపు ప్రక్రియను ప్రారంభించకపోతే రాష్ట్ర స్థాయిలో ధర్నా నిర్వహిస్తామనీ, ఈ విషయమై రైతు సంఘాలన్నిటితో కలిసి ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ మొదటి వారంలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని, జిల్లాలలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -