ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో

– విద్యార్థుల నమోదును పెంచే చర్యలు చేపట్టండి
– మభ్యపెట్టి ప్రవేశాలు చేపడుతున్న కార్పొరేట్‌ కాలేజీలు : ఇంటర్‌ బోర్డు కార్యదర్శికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థుల నమోదును పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజాకు ఆయన మంగళవారం లేఖ రాశారు. రాష్ట్రంలో 416 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో 85,038 మంది, ద్వితీయ సంవత్సరంలో 78,799 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ప్రతి కాలేజీలో కనీసం నాలుగు గ్రూపులుండాలనీ, ఒక్కో దాంట్లో కనీసం 40 మంది విద్యార్థులుంటే ప్రథమ సంవత్సరంలో 160 మంది, ద్వితీయ సంవత్సరంలో 160 మంది కలిపి మొత్తం 320 అవుతారని పేర్కొన్నారు. కానీ 25 జూనియర్‌ కాలేజీల్లో వందలోపు, 75 కాలేజీల్లో 200 లోపు విద్యార్థులున్నారని వివరించారు. హైదరాబాద్‌లోని హుస్సేనీ ఆలం కాలేజీల్లో 1,500 నుంచి రెండు వేల వరకు, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నాంపల్లిలోని జూనియర్‌ కాలేజీల్లో 1,200 మంది విద్యార్థుల వరకు చదువుతున్నారని తెలిపారు. ప్రయివేటు జూనియర్‌ కాలేజీల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 2.50 లక్షల చొప్పున చదువుతున్నారని పేర్కొన్నారు. ఒక్కో గ్రూపులో పది మందిలోపు విద్యార్థులున్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 30కిపైగా ఉన్నాయని వివరించారు. నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్‌ కాలేజీలు పీఆర్వోలను నియమించుకుని పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రవేశాలు చేపడుతున్నాయని విమర్శించారు. ఆ ప్రవేశాల ప్రక్రియను నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. పదో తరగతిలో పది జీపీఏను సాధించిన వారిలో ఎక్కువ మంది కార్పొరేట్‌ కాలేజీల్లో చదువుతున్నారని తెలిపారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో వారు సాధించిన మార్కులు, ర్యాంకులను విడుదల చేయాలని కోరారు. కొద్ది మందికి మాత్రమే మంచి ర్యాంకులు వస్తున్నాయని వివరించారు. మెజార్టీ విద్యార్థులు ఇంటర్‌లో తక్కువ మార్కులను సాధిస్తున్నారని తెలిపారు. పదో తరగతిలో తక్కువ జీపీఏ లేదా సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థులే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చేరుతున్నారని వివరించారు. అయినా అక్కడ మెరుగైన ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాలతో కరపత్రాన్ని ముద్రించి తల్లిదండ్రులకు పంచితే వాస్తవాలు తెలుసుకుని తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చేర్పించే అవకాశముంటుందని సూచించారు.

Spread the love