– ఉద్యోగ భద్రత కల్పించాలి : ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మీసేవా ఉద్యోగులకు వేతనాలు పెంచి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఆ శాఖ ఉన్నతాధికారులు, సీఐటీయూ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ మీసేవా ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు జె. వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. జీతాల పెంపుదలకు జయేశ్‌రంజన్ సానుకూలత వ్యక్తం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు సమక్షంలో మరోసారి చర్చలు జరిపి ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాల చెల్లింపు, ఉద్యోగ భద్రత, పీఎఫ్ ఖాతాలో యజమాని, ఉద్యోగి వాటా చెల్లింపు, ఖాతాల అప్‌డేట్, అవర్‌లీ ఓటీ, కొరియర్ చార్జీలు రూ.500 నుంచి రూ.1,500కి పెంపు, వార్షిక ఇంక్రిమెంట్ 10 శాతం పెంపు, రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, మీసేవా సెంటర్లలో సెక్యూరిటీ గార్డుల నియామకం, తదితర డిమాండ్లను అధికారుల దృష్టికి పాలడుగు భాస్కర్, జె.వెంకటేశ్ తీసుకెళ్లారు.