– నెలకు సగటున రూ.1.66 లక్ష కోట్లకు చేరిక
– మంత్రి సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు నెలకు రూ.1.66 లక్షల కోట్లకు చేరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభమైన సందర్భంగా లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2017 జులైలో జిఎస్‌టి ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రతీ ఏడాది పన్ను వసూళ్లు పెరుగుతూనే వస్తున్నాయన్నారు. గడిచిన ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ప్రతీ నెల రూ.1.50 లక్షల కోట్ల పైనా వసూళ్లు జరుగుతున్నాయన్నారు. గతేడాది తో పోల్చితే 11 శాతం వృద్థి చోటు చేసుకుంటుందన్నారు. 2022-23లో ప్రతీ నెల సగటున రూ.1.50 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.23 లక్షల కోట్లు, 2020-21లో రూ.94,734 కోట్ల చొప్పున ప్రతీ నెల వసూళ్లు జరిగాయన్నారు.
కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మరో ప్రశ్నకు సమాధానంగా చెబుతూ 2021-22లో 30 శాతం, 2022-23లో 22 శాతం స్థూల జిఎస్‌టి వసూళ్లు పెరిగాయన్నారు. వ్యాపారులు స్వయం మదింపు ప్రకారం జిఎస్‌టి చెల్లిస్తున్నారని అన్నారు. ఒకవేళ పన్నులు చెల్లించకున్నా.. తక్కువ చెల్లించినా సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకునే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఉందన్నారు. ప్రస్తుత ఏడాది నవంబర్‌లో దేశంలో రూ.1,67,929 కోట్ల వస్తు సేవల పన్నులు (జిఎస్‌టి) వసూళ్లయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 15 శాతం పెరిగాయి. 2023-24లో జిఎస్‌టి వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఆరోసారి కావడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.