Saturday, September 19, 2026
E-PAPER
Homeజాతీయంఆధునిక వాతావరణ సవాళ్ల పరిష్కారానికి భారత్‌ ‌కృషి

ఆధునిక వాతావరణ సవాళ్ల పరిష్కారానికి భారత్‌ ‌కృషి

- Advertisement -

కార్బన్ ఉద్గారాలు విదేశాల్లోనే 
ఆరు రెట్లు ఎక్కువ
​ఎన్‌జీటీ గ్లోబల్‌ గ్రీన్‌ మీట్‌ సదస్సులో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : నేటి ఆధునిక వాతావరణ సవాళ్లకు పరిష్కారాలు అందించే దిశగా భారత్ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రకృతి, పర్యావరణానికి సంబంధించిన అంశాలపై శతాబ్దాలుగా భారత్ ప్రపంచానికే మార్గనిర్దేశం చేసిందని గుర్తు చేశారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ క్లైమేట్‌ డైనమిక్స్‌’ అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రకృతి, పర్యావరణం విషయంలో భారతదేశం శతాబ్దాలుగా ఈ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసింది. ఆ సైద్ధాంతిక నిబద్ధతను ముందుకు తీసుకెళ్తూ, మన గొప్ప సాంస్కృతిక అనుభవాలను పునాదిగా చేసుకొని, భారతదేశం ఇప్పుడు ఆధునిక వాతావరణ సవాళ్లకు పరిష్కారాలు అందిస్తోంది. కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను తరచుగా నిందిస్తున్నారు. చారిత్రక వాస్తవం ఏమిటంటే, ఇప్పటికీ తలసరి కర్బన ఉద్గారాల విషయంలో భారతదేశం వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉంది. ఇదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి కర్బన ఉద్గారాలు భారత్ కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. భారత్ ఈ విషయాన్ని ప్రపంచ వేదికలపై నిలకడగా, దృఢ విశ్వాసంతో స్పష్టంగా చెబుతోంది. ప్రతి భారతీయుడు ఇదే దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాలని నేను కోరుతున్నా” అని మోడీ అన్నారు.

భారత్ గణనీయమైన పురోగతి
‘‘పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ, ప్రతి విభాగంలోనూ పన్నెండేండ్లలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనంపై దృష్టి సారించాం. పారిస్ (కాప్-21) నిబంధనలకు అనుగుణంగా వాతావరణ కాలుష్యం జరగకుండా ముందుగానే తగు చర్యలు తీసుకున్నాం. పారిస్‌‌లో జరిగిన కాప్-21 సదస్సులో చేసిన నిబంధనలను, కట్టుబాట్లను గడువు కంటే ముందుగానే నెరవేర్చిన జీ-20లోని ఏకైక దేశంగా భారత్ నిలిచింది. ఇదే నూతన భారతదేశ శక్తి. శిలాజేతర ఇంధనాలు, సౌరశక్తి సామర్థ్యం, కర్బన ఉద్గారాల నియంత్రణల్లోనూ భారత్ అభివృద్ధిని సాధించింది” అని మోడీ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -