సింధు పరాజయం

Sindhu's defeat– యమగూచి చేతిలో ఓటమి
– ఆసియా చాంపియన్‌షిప్స్‌ 2025
నిగ్బో (చైనా): ఈ ఏడాదిలో భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి క్రీడాకారుల పేలవ ఫామ్‌ కొనసాగుతుంది. ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌ నుంచి ఇప్పటికే లక్ష్యసేన్‌, హెచ్‌.ఎస్‌ ప్రణరు పరాజయం పాలవగా.. తాజాగా డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పి.వి సింధు సైతం నిష్క్రమించింది. మహిళల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో పి.వి సింధు వరుస గేముల్లో నిరాశపరిచింది. మూడో సీడ్‌, జపాన్‌ స్టార్‌ అకానె యమగూచి 21-12, 16-21, 21-16తో మూడు గేముల మ్యాచ్‌లో సింధుపై విజయం సాధించింది. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో తడబాటుకు లోనైనా.. రెండో గేమ్‌లో గొప్పగా పుంజుకుంది. 21-16తో రెండో గేమ్‌ సొంతం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. కానీ చావోరేవో తేల్చుకోవాల్సిన గేమ్‌లో సింధు మళ్లీ వెనుకంజ వేసింది. యమగూచి సూపర్‌ గేమ్‌ ముంగిట తలొంచింది. దీంతో ఆసియా చాంపియన్‌షిప్స్‌లో సింధు పోరాటానికి తెరపడింది. ఈ సీజన్‌లో సింధు అంచనాలను అందుకోవటం లేదు. ఇండియా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరిన సింధు.. ఇండోనేషియా మాస్టర్స్‌, ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌, స్విస్‌ ఓపన్‌లో తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది.
పి.వి సింధు ఓటమితో సింగిల్స్‌ విభాగంలో టీమ్‌ ఇండియా టైటిల్‌ వేట ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో కిరణ్‌ జార్జ్‌, ప్రియాన్షు రజావత్‌లు రెండో రౌండ్‌ మ్యాచ్‌లో పరాజయం పాలయ్యారు. ప్రియాన్షు రజావత్‌ 14-21, 17-21తో వరల్డ్‌ నం.7 నరొక (జపాన్‌) చేతిలో ఓటమి పాలవగా.. కిరణ్‌ జార్జ్‌ 21-19, 13-21, 16-21తో వరల్డ్‌ నం.5 కునాల్‌విట్‌ (థారులాండ్‌) చేతిలో పరాజయం చెందాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల, తనీశ క్రాస్టో జంట క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. 12-21, 21-16, 21-18తో ఐదో సీడ్‌ చైనీస్‌ తైపీ జోడీపై అలవోక విజయం సాధించారు.

Spread the love