Monday, August 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపవర్ లూమ్ కార్మికుల సంక్షేమానికి చొరవ చూపాలి

పవర్ లూమ్ కార్మికుల సంక్షేమానికి చొరవ చూపాలి

- Advertisement -

​వర్కర్‌ టూ ఓనర్‌ పథకాన్ని వెంటనే అమలు చేయాలి
10 హెచ్‌పీ వరకు పవర్‌‌లూమ్‌లకు ఉచిత విద్యుత్‌ అందించాలి
వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలి
సిరిసిల్లలో టెక్స్‌టైల్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ
(సీఐటీయూ) జాతీయ సమావేశాలు

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి, ఆదాయం కల్పిస్తున్న టెక్స్‌టైల్‌, పవ‌ర్‌‌లూమ్‌ పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఐటీయూ జాతీయ కార్యదర్శి కరుమలయన్‌, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్‌ ‌చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాజుల మల్లయ్య ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం టెక్స్‌టైల్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (సీఐటీయూ) జాతీయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో వారు మాట్లాడారు. పరిశ్రమ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించకుండా, కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధానాలను అవలంబించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్‌, పవర్‌‌లూమ్‌ రంగం లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉందన్నారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.

కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను పరిరక్షించాల్సింది పోయి వాటిని కాలరాసే విధానాలను అవలంబించడం ఆందోళనకరమన్నారు. పవర్‌‌లూమ్‌ కార్మికులకు ప్రయోజనం చేకూర్చే వర్కర్‌ టూ ఓనర్‌ పథకాన్ని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా స్పష్టమైన కార్యాచరణ రూపొందించి పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అలాగే, పరిశ్రమను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు విద్యుత్‌ భారాన్ని తగ్గించాలని, 10 హెచ్‌పీ వరకు ఉచిత విద్యుత్‌ అందించాలని, చిన్నతరహా యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్మికుల కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేసి, దాని ద్వారా కార్మికులకు సామాజిక భద్రత, ఆరోగ్యం, విద్య, పింఛన్‌, ప్రమాద బీమా తదితర సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెక్స్‌టైల్‌, పవర్‌‌లూమ్‌ రంగ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. పవర్‌‌లూమ్‌ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు ఐక్యంగా నిలిచి తమ హక్కుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్‌‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్‌, ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్‌, సీఐటీయూ జాతీయ టెక్స్‌టైల్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ నాయకులు చంద్రన్‌, సునీల్‌ చౌహన్‌, అశోకన్‌, పెరుమాళ్‌, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళి, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు సోమన్న, జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ, జిల్లా నాయకులు, ఆసాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -