Monday, August 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

- Advertisement -

ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ పంచాయతీ ఎంప్లాయీస్ జాతీయ అధ్యక్షులు క్రిస్టోఫర్ జౌసెకా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి ప్రభుత్వ పే స్కేల్ అమలు చేయాలని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ పంచాయతీ ఎంప్లాయీస్(ఏఐటీయూసీ) జాతీయ అధ్యక్షులు క్రిస్టోఫర్ జౌసెకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు కార్మిక హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ పంచాయతీ ఎంప్లాయిస్(ఏఐటీయూసీ) జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ఎండి.యూసుఫ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్టోఫర్ జౌసెకా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ప్రజా సేవలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం, ఎన్నికల విధులు, ఓటర్ల జాబితా సవరణలో ఇఎల్ పనిచేయడం వంటి అనేక కీలక బాధ్యతలను పంచాయతీ కార్మికులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రజాస్వామ్య వ్యవస్థకు పంచాయతీలు పునాది వంటివని, వాటి పనితీరులో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. పంచాయతీ కార్మికులకు నెలకు కనీసం రూ.26 వేల వేతనం చెల్లించాలని, వారిని ఇఎస్ఐ, పీఎఫ్ పరిధిలోకి తీసుకురావడంతో పాటు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. దేశంలో సుమారు 6.12 లక్షల గ్రామ పంచాయతీలున్నాయని, ఒక్కో పంచాయతీలో సగటున 10 నుంచి 15 మంది కార్మికులు పనిచేస్తున్న నేపథ్యంలో దాదాపు 30 లక్షల మంది పంచాయతీ కార్మికులు ఉన్నట్లు తెలిపారు. పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న డిమాండ్ 1984లో గోవాలో ప్రారంభమైందని గుర్తు చేశారు. ఈ డిమాండ్ సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు కార్మికుల ప్రయోజనాల కంటే యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. కాంట్రాక్ట్, ఫిక్డ్స్‌ టర్మ్ ఉద్యోగాలను ప్రోత్సహించడం ద్వారా శాశ్వత ఉద్యోగాలు, ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. కనీస వేతనాల అమలులోనూ కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. కార్పొరేట్, వ్యాపార వర్గాల ప్రయోజనాల కంటే కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువత, కార్మికులు తమ హక్కుల కోసం ఆందోళనలు చేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించకుండా నిరసనలపై పోలీసు చర్యలకు దిగడం సరైన విధానం కాదని విమర్శించారు. సమావేశంలో పంచాయతీ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి నామ్ చౌహన్, కార్యదర్శి ఎల్జిబెత్, కోశాధికారి రాహుల్ జాదవ్, తెలంగాణ అధ్యక్షుడు నర్సింహరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటరాజం, ఉప ప్రధాన కార్యదర్శి మల్లయ్య, కోశాధికారి రాంచంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులు అంజనేయులు, ఏఐటీయూసీ నాయకురాలు హసీనాబేగంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -