గాయపడిన పాలస్తీనా పౌరుణ్ణి వెహికల్‌ బారునెట్‌కు కట్టి ఊరేగింపు

గాయపడిన పాలస్తీనా పౌరుణ్ణి వెహికల్‌ బారునెట్‌కు కట్టి ఊరేగింపు– ఇజ్రాయిల్‌ సైన్యం దాష్టీకం
– సోషల్‌ మీడియాలో వైరల్‌
గాజా సిటీ: ఇజ్రాయిల్‌ సైన్యం దాష్టీకాలకు అడ్డు అదుపులేకుండాపోతోంది. తమ దాడుల్లో గాయపడిన ముజాహిద్‌ అజ్మీ అనే పాలస్తీనా పౌరుణ్ణి సైనిక వాహనం బారునెట్‌కు కట్టి ఊరేగించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వెస్ట్‌ బ్యాంక్‌లోని జునిన్‌పై ఇజ్రాయిల్‌ దాడి చేసిన తరువాత ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. బాంబు దాడిలో గాయపడి నెత్తురోడుతున్న పాలస్తీనీయుని పట్ల అత్యంత అమానుషమైన రీతిలో ఇజ్రాయిల్‌ సైన్యం వ్యవహరించడంపై నెటిజెన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాస్‌ ‘ఉగ్రవాదులపై’ జరిపిన కాల్పుల్లో అజ్మీ గాయపడ్డాడని, అతను ఉగ్రవాది అన్న అనుమానం కలుగుతోందంటూ ఇజ్రాయిల్‌ సైన్యం తన చర్యను సమర్థించుకునే యత్నం చేసింది. అజ్మీని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు అంబులెన్స్‌ కోసం వెతుకుతుండగా, ఇంతలోనే ఇజ్రాయిల్‌ సైన్యం అక్కడికి వచ్చి అతణ్ణి సైనిక వాహనానికి కట్టి ఊరేగింపుగా తీసుకెళ్లిందని స్థానిక మీడియా తెలిపింది. ఇంత దారుణం జరిగినా అమెరికా కానీ, ఇతర పశ్చిమ దేశాలు కానీ దీనిని ఖండించకపోవడం గమనార్హం.

Spread the love