ఆపదలో వున్న మరో వాణిజ్య నౌకని కాపాడిన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం

న్యూఢిల్లీ: ఎర్ర సముద్రంలో, అడెన్‌ జలసంధిలో హుతి రెబెల్స్‌ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మార్షల్‌ ఐల్యాండ్‌ పతాకంతో వున్న వాణిజ్య నౌక ఎం.వి.జెన్‌కో పికార్డిని భారత నావికాదళం కాపాడింది. బుధవారం రాత్రి 11.11గంటలకు పికార్డి నౌకపై ద్రోణ్‌ దాడి జరగడంతో కాపాడాలంటూ పంపిన సందేశానికి స్పందించిన భారత నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం నౌక రంగంలోకి దిగింది. అడెన్‌ జలసంధిలో గస్తీ చర్యలు చేపట్టింది. బుధవారం అర్ధరాత్రి దాటిన అరగంటకే ఆ నౌకలోని సభ్యులతో మాట్లాడింది. వారికి అవసరమైన సాయం అందించిందని భారత నావికాదళం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేదా మరణాలు సంభవించినట్లు వార్తలందలేదని, నౌక కూడా తన ప్రయాణాన్ని సాగిస్తోందని తెలిపింది. జనవరి 11న ఈజిప్ట్‌లోని సఫగా ఓడరేవు నుండి బయలుదేరిన పికార్డి నౌక 24న తమిళనాడులోని తూత్తుకుడికి రావాల్సి వుంది. సముద్ర జలాల్లో సముద్ర చౌర్యాన్ని నిరోధించేందుకు, భద్రతా విధుల్లో పాల్గొనేందుకు అరేబియా సముద్ర జలాల్లో 12 యుద్ధ నౌకలను భారత నావికాదళం మోహరించింది. యుద్ధనౌకలోని పేలుడు పదార్ధాల నిర్వీర్య నిపుణులు గురువారం తెల్లవారు జామున బాధిత నౌకలో దెబ్బతిన్న ప్రాంతంలో సోదాలు చేపట్టారని నేవీ తెలిపింది. కూలంకషంగా తనిఖీలు జరిగిన అనంతరం ఆ నౌక ముందుకు సాగడానికి అనుమతినిచ్చారని తెలిపింది.

Spread the love