– లండన్‌లో బహుకరించనున్న పురస్కారం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జర్నలిజంలో అంతర్జా తీయ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవార్డ్-2023ను ఫ్యాక్ట్ చెక్ సంస్థ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ సొంతం చేసుకున్నారు. ఇండెక్స్ ఆన్ సెన్సార్షిప్ ఈ అవార్డును శుక్రవారం ప్రకటిం చింది.. ”అధికార పార్టీకి చెందిన ప్రభావవంతమైన సభ్యులు ప్రచారం చేసిన తప్పుడు సమాచారాన్ని సవాలు చేసిన తరు వాత జుబైర్ చాలా బెదిరింపులను ఎదుర్కొన్నారు” అని సంస్థ తెలిపింది.
ఇండెక్స్ ఆన్ సెన్సార్షిప్ అనేది లండన్ ఆధారిత లాభాపేక్ష లేని సంస్థ. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కోసం ప్రచారం చేస్తోంది. ”ప్రపంచంలో ఎక్కడైనా సెన్సార్‌షిప్‌పై గణనీయమైన ప్రభావం చూపే కళలు, ప్రచారం, జర్నలిజం, ట్రస్టీ అనే నాలుగు విభాగాలలో వార్షిక వ్యక్తీకరణ స్వేచ్ఛా పురస్కారాలు అందజేస్తుంది. యునైటెడ్ కింగ్డమ్ లోని లండన్‌లో జరిగే వేడుకలో విజేతలను సత్కరిస్తారు. ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు.
ఈ అవార్డును స్వీకరించడం గురించి జుబైర్ స్పందిస్తూ తమ యువ సహౌద్యోగులకు ఇది ”ఆశాజ్యోతి ” అనిఅని అన్నారు. ”భావప్రకటన స్వేచ్ఛ అవార్డును అందుకోవడం ఒక గౌరవం. ప్రత్యేకించి దేశంలో ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం ఫ్రాంకెన్‌స్టైయిన్ రాక్షసుడిగా ఉద్భవించింది” అని జుబైర్ చెప్పారు.
”నేను పని చేసేటపుడు.. నాపై దాడి జరిగినప్పుడు, దూషించ బడినప్పుడు, జైలు శిక్షకు గురైనప్పుడు నాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు” తెలిపారు. జుబైర్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు గతేడాది 24 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఉత్తరప్రదేశ్‌లో జుబేర్ ఆరు కేసులు, ఢిల్లీలో ఒక కేసును ఎదుర్కొంటున్నారు.