Saturday, June 20, 2026
E-PAPER
Homeజాతీయం​మత్తు..చిత్తు

​మత్తు..చిత్తు

- Advertisement -

భారత్‌‌లో 37 కోట్ల మంది బానిసలు
ఏటా 9 లక్షల మరణాలు..దేశంలో కోరలు చాస్తున్న డ్రగ్స్ కల్చర్‌
​తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా..కట్టడి చేయకపోతే ఇబ్బందులేనంటున్న నిపుణులు

​దేశవ్యాప్తంగా డ్రగ్స్ కల్చర్ ను రూపుమాపుతామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలు మాటలకే పరిమితమవు తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ సరిహద్దుల నుంచి మత్తు పదార్థాలు యథేచ్ఛగా సముద్ర, ఆకాశ మార్గాల ద్వారా వస్తున్నా కట్టడి చేయటంలో కేంద్రం పూర్తిగా విఫలమవుతోంది. గుజరాత్ తీరం నుంచే డ్రగ్స్ మాఫియా డ్రగ్స్ ను తరలిస్తున్నదన్న విషయం ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాకు తెలియనిదేం కాదు. గుజరాత్ నుంచి యూపీ, రాజస్తాన్, గోవా ఇలా సముద్రతీరంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే మత్తు పదార్థాలు డెలివరీ అవుతున్నాయి. రాజకీయ నేతలు, అధికారుల అండదండలతో రూ. కోట్లల్లో విచ్ఛలవిడిగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది.

న్యూఢిల్లీ : డ్రగ్స్ వ్యసనం దేశ యువతను చిత్తు చేస్తోంది. యువతనే కాకుండా కొంత మంది పెద్దలు కూడా ఈ మత్తుపదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చేతులారా ప్రాణాలను పొగొట్టుకుం టున్నారు. దీంతో వారి కుటుంబాలు ఆర్థికంగా గుల్లవుతు న్నాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను కోల్పోతున్నారు. అయితే మాదకద్రవ్యాల దుర్వినియోగంపై భారత్ పోరాటం కొన్ని సరిహద్దు రాష్ట్రాలకో, కొన్ని ప్రదేశాలకో పరిమితం కాలేదు. అయినా దేశంలోని పంజాబ్ వంటి పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి కోరలు చాస్తోంది. ఫలితం గా దేశంలో వివిధ రూపాల్లో మత్తపదార్థాల కు 37కోట్ల మంది బానిసైనట్టు నివేదికలు చెబుతున్నాయి. మాదక ద్రవ్యాల వల్ల ఏటా 9లక్షల మరణాలు సంభవిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది.

పంజాబ్‌లో తీవ్ర స్థాయిలో డ్రగ్స్ వినియోగం
పంజాబ్‌లో డ్రగ్స్ మహమ్మారి విస్తరిస్తోంది. అక్కడి యువతను కబళించేస్తోంది. దీంతో ఈ వ్యసనానికి బానిసైన యువత ప్రాణాలు కోల్పోతున్నారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్ సీఆర్బీ) ప్రకారం 2024లో పంజాబ్‌లో మాదక ద్రవ్యాలను అధిక మోతాదులో వాడడం వల్ల 106 మంది మరణించారు. అంటే ప్రతి నాలుగు రోజులకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ మరణాల వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది.

మత్తుపదార్థాలు సేవిస్తున్న 3.7 కోట్ల మంది
దేశంలో డ్రగ్స్ వినియోగ పరిధి, తీరుపై సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ సర్వే ప్రకారం 3.7 కోట్ల మందికి పైగా ప్రజలు ఏదో ఒక రకమైన మత్తు పదార్థాన్ని సేవిస్తున్నారు. 10- 75 సంవత్సరాల మధ్య వయసు గల దాదాపు 1.6 కోట్ల మంది మద్యాన్ని సేవిస్తున్నారు. సుమారు 3.1 కోట్ల మంది గంజాయిని వాడుతున్నారు. రెండు శాతానికి పైగా మంది ఓపియాయిడ్లను (హెరాయిన్ వంటివి) వాడుతున్నారు. 8.5 లక్షల మంది ఇంజెక్షన్ ద్వారా మాదకద్రవ్యాలను తీసుకుంటున్నారని సర్వేలో తేలింది.

యావత్ దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్య
ఈ డ్రగ్స్ సమస్య కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచదేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఐక్యరాజ్యసమితి మాదకద్రవ్యాలు, నేరాల కార్యాలయం ప్రకారం, 2023లో 15-64 సంవత్సరాల మధ్య వయసు గల దాదాపు 31.6 కోట్ల మంది ప్రజలు మద్యం, పొగాకు కాకుండా ఇతర మాదకద్రవ్యాలను సేవించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగించే మత్తు పదార్థంగా గంజాయి నిలిచింది. దాని తర్వాత ఓపియాయిడ్లు, యాంఫెటమైన్లు, కొకైన్, ఎండీఎంఏలు ఉన్నాయి. మాదకద్రవ్యాల ముఠాలు అధునాతన, కృత్రిమ పదార్థాలను ప్రమాదకర రీతిలో వ్యాప్తి చేస్తూ వాటి లభ్యతను పెంచుతున్నందున, ఈ ముప్పును అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఒకే తాటిపై పనిచేయాల్సి ఉంది.

ఆల్కహాల్ తాగి ఏటా 26లక్షల మంది మరణం
​ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కేవలం మద్యం తాగడం వల్ల 26 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వివిధ ఆరోగ్య అధ్యయనాల ప్రకారం, భారత్‌లో ధూమపానం, మద్యం, మాదకద్రవ్యాలకు బానిసై ఏటా 9 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. 2024 నాటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, భారత్‌లో మద్యం సంబంధిత మరణాల రేటు ప్రతి లక్ష జనాభాకు 38.5గా ఉంది. పురుషుల విషయానికొస్తే ఈ సంఖ్య లక్ష జనాభాకు 63గా ఉంది. ఇది చైనాలోని 29.6తో పోలిస్తే చాలా ఎక్కువ. మహిళల్లో ఈ సంఖ్య 13.5గా ఉంది. మరోవైపు, అధిక మోతాదులో మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల సంభవించే మరణాలు కూడా పెరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం, 2024లో భారతదేశంలో మాదకద్రవ్యాల అధిక వినియోగం వల్ల 978 మంది మరణించారు. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 654గా ఉండేది.

​దేశ జీడీపీకి నష్టం
ఇప్పుడు డ్రగ్స్ వ్యసనానికి సంబంధించి అందరి దృష్టికి రాని మరో కోణం గురించి మాట్లాడుదాం. మత్తుపదార్థాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తాయి. పలు అధ్యయనాల ప్రకారం, మద్యం సంబంధిత అనారోగ్యాలు, ప్రమాదాలు, అకాల మరణాల వల్ల భారత్ ఏటా తన స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో దాదాపు 1.45 శాతం నష్టపోతోంది. పొగాకు సంబంధిత వ్యాధుల వల్ల మరో శాతం నష్టం వాటిల్లుతోంది. హెరాయిన్, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వల్ల కలిగే ఆర్థిక భారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే, మొత్తం వార్షిక నష్టం రూ.1.5 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. సామాజిక, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కూడా కలిపితే, ఈ భారం జీడీపీలో 2.5 శాతాన్ని మించిపోతుంది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తున్న దేశానికి, ఇది ఒక కనిపించని ఆర్థిక నష్టం. అలాగే ఒక పెద్ద సవాల్ కూడా.

డ్రగ్స్ కోసం రోజుకు రూ.2వేలు ఖర్చు
​పంజాబ్, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్, రాజస్తాన్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్’ నిర్వహించిన ఒక అధ్యయనంలో సగటు మాదకద్రవ్య వినియోగదారుడు రోజుకు దాదాపు రూ.2,000 వరకు డ్రగ్స్ కొనుగోలుకు ఖర్చు చేస్తున్నట్లు తేలింది. జమ్మూకాశ్మీర్‌లో 2022లో జరిగిన ఒక సర్వేలో హెరాయిన్ వినియోగదారులు నెలకు దాదాపు రూ.88,000 ఖర్చు చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ డ్రగ్స్ వ్యసనం కారణంగా కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. దీంతో చాలా మంది నగలు అమ్ముకుంటున్నారు. ఇంకొంత మంది భూమిని తాకట్టు పెట్టడం, అమ్మడం వంటివి చేస్తున్నారు.

ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టినా!
​ దేశంలో డ్రగ్స్ నుంచి విముక్తి చికిత్సకు సగటున సుమారు రూ.70,000 ఖర్చవుతుంది. అయితే కేసులను బట్టి ఈ ఖర్చులు మారవచ్చు. పునరావాస కేంద్రాలు నెలకు రూ.25,000- రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. దేశ ఆరోగ్య సంరక్షణ వ్యయంలో ఐదు శాతానికి పైగా పొగాకు సంబంధిత అనారోగ్యాలకే కేటాయిస్తున్నారు. ఇది ప్రజారోగ్య మౌలిక సదుపాయాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తోంది. మత్తుపదార్థాలకు బానిసయ్యేవారిని బయటకు తీసుకొచ్చేందుకు కేంద్రం 2020 ఆగస్టులో 272 జిల్లాల్లో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ను ప్రారంభించింది. ఆ తర్వాత ఈ ప్రచారాన్ని దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది. 10,000 మందికి పైగా మాస్టర్ వాలంటీర్లను సమీకరించగా, ఈ కార్యక్రమం దాదాపు ఐదు కోట్ల మంది యువత, మూడు కోట్ల మంది మహిళలతో సహా 14.79 కోట్ల మందికి పైగా ప్రజలకు చేరింది. ఇన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్ కట్టడికి విశ్వసనీయమైన డేటా లేకపోవడమే ప్రధాన అడ్డంకిగా మారిందని నిపుణులు భావిస్తున్నారు.

డ్రగ్స్ కారణంగా ఐదుగురు బిడ్డలను కోల్పోయిన తల్లి
ఈ ఏడాది ఏప్రిల్‌లో పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన ఓ మహిళ నిస్సహాయ స్థితిలో పోలీసులకు ఫోన్ చేసింది.
 ఆమె కన్నీరు పెడుతూ ఇలా చెప్పింది. ‘‘నేను ఇప్పటికే మాదకద్రవ్యాల వల్ల నలుగురు కొడుకులను పోగొట్టుకున్నాను. 
నా ఐదో కొడుకు కూడా అదే కారణంతో మంచాన పడి మరణం అంచున ఉన్నాడు. డ్రగ్స్ మా పరిసర ప్రాంతాన్ని నాశనం చేసింది. కొందరు తల్లులు ఒక కొడుకును కోల్పోతే, మరికొందరు ఇద్దరిని కోల్పోయారు. నేను ఇప్పటికే నలుగురిని కోల్పోయాను. దయచేసి మాదకద్రవ్యాల వ్యాపారులను పట్టుకోండి” అని తీవ్ర ఆవేదనతో పోలీసులకు విజ్ఞప్తి చేసింది. అయితే ఆమె ఈ ఫోన్ చేసిన రెండ్రోజుల తర్వాత ఆమె ఐదో కుమారుడూ చనిపోయాడు. ఈ ఘటన పంజాబ్‌లో మాదక ద్రవ్యాల వినియోగం పరిస్థితిని తెలియజేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -