నిమ్స్‌కు ఐపీసీ ప్రశంస

–  ఔషధ భద్రత కృషికి సర్టిఫికేట్‌ ఆఫ్‌ అప్రిసియేషన్‌ ప్రదానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పలు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంటున్న ప్రతిష్టాత్మక నిమ్స్‌ ఆస్పత్రి మరోసారి ప్రశంసలందుకుంది. నిమ్స్‌ క్లినికల్‌ ఫార్మకాలజీ అండ్‌ థెరప్యూటిక్స్‌ విభాగంలో ఉన్న అడ్వర్స్‌ డ్రగ్‌ రియాక్షన్‌ మానిటరింగ్‌ సెంటర్‌ సేవలను ఇండియన్‌ ఫార్మాకోపియా కమిషన్‌ (ఐపీసీ) ప్రశంసించింది. నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌-ఫార్మాకోవిజిలెన్స్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిమ్స్‌లో నిర్వహిస్తున్న ప్రాంతీయ శిక్షణా కేంద్రం ఔషధ భద్రతకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని పేర్కొంది. క్లినికల్‌ ఫార్మకాలజీ అండ్‌ థెరప్యూటిక్స్‌ విభాగాధిపతి, డాక్టర్‌ పి.ఉషా రాణి నాయకత్వంలో ఔషధ భద్రతను ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యలకుగాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఐపీసీ ”సర్టిఫికెట్‌ ఆఫ్‌ అప్రిషియేషన్‌”ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. బీరప్ప ఈ విజయానికి, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.ఉషా రాణి, డిప్యూటీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం పద్మజ, ఆ విభాగం అధ్యాపకులు, రెసిడెంట్‌ డాక్టర్లను అభినందించారు. ఔషధ భద్రతపై ప్రజలకు, రోగులకు అవగాహనా కార్యక్రమాలను, ఆరోగ్య సిబ్బందికి విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సర్టిఫికేట్‌ ప్రదానం సందర్భంగా శుక్రవారం నిమ్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఫార్మాకోవిజిలెన్స్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ ఇండియా ఆఫీసర్‌ ఇన్‌ ఛార్జి డాక్టర్‌ జై ప్రకాష్‌ అధ్యక్షత వహించారు. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌ సీఓ)కు చెందిన డాక్టర్‌ సోమనాథ్‌ బసు తదితరులు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా దేశ నలుమూలల నుంచి వైద్యులు, ఫార్మాకోవిజిలెన్స్‌ అసోసియేట్స్‌, ఫార్మా పరిశ్రమ నిపుణులు, డ్రగ్‌ రెగ్యులేటరీ అధికారులు పాల్గొన్నారు.

Spread the love