భారతీయులకు వీసా రహిత ఎంట్రీని ప్రకటించిన ఇరాన్!

నవతెలంగాణ – హైదరాబాద్: భారతీయ పర్యాటకులకు ఇరాన్ తాజాగా వీసా రహిత ఎంట్రీ పథకాన్ని ప్రకటించింది. వీసా అవసరం లేకుండానే తమ దేశానికి రావచ్చని మంగళవారం ప్రభుత్వం పేర్కొంది. ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకానికి ఇరాన్ ప్రభుత్వం కొన్ని పరిమితులు కూడా విధించింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం, విమాన ప్రయాణికులకు మాత్రమే ఈ వీసా రహిత ఎంట్రీ పథకం వర్తిస్తుంది. పర్యటనలకు మాత్రమే వర్తించే ఈ పథకంలో కేవలం 15 రోజుల పాటు దేశంలో పర్యటించేందుకు అనుమతిస్తారు. ఈ గడువును ఎట్టిపరిస్థితుల్లోనూ పొడిగించబోమని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఈ వీసా రహిత టూర్‌లకు అనుమతిస్తామని పేర్కొంది. మరిన్ని రోజులు ఇరాన్‌లో పర్యటించాలన్నా లేదా ఆరు నెలలలోపు పలుమార్లు ఇరాన్‌కు రావాలన్నా సంబంధిత వీసాలకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ గత నెలలో ఇరాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి విదేశీ వ్యవహారాల మంత్రితో సమావేశమై పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరిపారు.

Spread the love