సైన్యంలో చేరిన ఇజ్రాయెల్‌ జర్నలిస్టు

నవతెలంగాణ -గాజా : హమాస్‌ ఉగ్రవాదులతో ఇజ్రాయెల్‌ భీకర యుద్ధం సాగిస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ కొన్ని మినహాయింపులతో 3 లక్షల మందిని సైన్యంలో చేర్చుకుంది. 18 ఏళ్లు దాటిన యువతీయువకులు దీనిలో చేరేందుకు అర్హులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ప్రముఖ జర్నలిస్టు హనన్య నఫ్తాలీ తన కుటుంబాన్ని వదిలి దేశం కోసం పోరాడేందుకు సిద్ధపడ్డారు.ఈ క్రమంలో తన భార్య ఇండియా నఫ్తాలీకి వీడ్కోలు పలికి రణరంగంలోకి దిగారు. కుటుంబాన్ని వీడుతున్న క్షణంలో భావోద్వేగానికి గురవుతున్న ఫొటోను ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేశారాయన. ”నా దేశం కోసం పోరాడేందుకు నేను సైన్యంలో చేరాను. కేవలం సరిహద్దు కోసమే కాకుండా ఎన్నో వేల కుటుంబాల కోసం పోరాడుతున్నాను. నా భార్య ఇండియా నఫ్తాలీకి గుడ్‌బై చెప్పి యుద్ధానికి వచ్చాను. ఇక నుంచి నా ఖాతాను ఆమె నిర్వహిస్తుంది” అని హనన్య పోస్టు చేశారు. ఇండియా నఫ్తాలీ కూడా జర్నలిస్టే. అక్కడ జరుగుతున్న దాడుల గురించి ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

Spread the love