నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల ఇరాన్ కువైట్‌పై దాడులు చేసింది. ఈ దాడుల్ని యూరోపియన్ యూనియన్(ఈయూ) ఖండించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి దాడులు చేసిందని తీవ్రంగా ఆరోపించింది. అయితే ఈ ఖండనను ఇరాన్ వ్యతిరేకించింది. ఈయూ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో తీవ్రంగా విమర్శించింది.
కాగా, ‘పొరుగు దేశాల్లోని స్థావరాల నుండి అమెరికా జరిపిన దురాక్రమణకు వ్యతిరేకంగా తమను తాము రక్షించుకునేందుకు ఆత్మరక్షణ హక్కును వినియోగించుకున్నందుకు ఇరాన్‌ను నిందిస్తూ యూరోపియన్ యూనియన్ ప్రకటన చేసింది. ఈ ప్రటకన పక్షపాత ధోరణికి ఒక చక్కటి ఉదాహరణ. ఇది కపటమైనది.. నిర్లక్ష్యపూరితమైనది. తాను ఎప్పటినుంచో సమర్థిస్తున్నామని చెప్పుకుంటున్న చట్టబద్ధ పాలనకు, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు ఇయు కట్టుబడి ఉండాలి. చట్టవిరుద్ధమైన దాడులకు ప్రతిస్పందించేవారిని నిందిస్తూ, దురాక్రమణదారులను బుజ్జగించడం అది మానుకోవాలి’ అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ సోమవారం ఎక్స్‌పోస్టులో పేర్కొన్నారు.



