హార్ముజ్‌పై కొత్త సమీకరణ
• జలసంధిలో జోక్యానికి అనుమతించం : ఇరాన్
• యూఏఈపై దాడిలో భారతీయులకు గాయాలపై స్పందించిన భారత్
బీజింగ్, టెహ్రాన్ : హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ఏ చర్యలనూ అనుతించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. హర్మూజ్‌పై కొత్త సమీకరణ రూపు దిద్దుకుంటోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎంబి ఘలిబఫ్ మంగళవారం ప్రకటించారు. ‘‘అమెరికా, దాని మిత్రపక్షాల చర్యల వల్ల నౌకల రవాణా, వాటి భద్రత తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. అయితే వారి దుష్ట సంకల్పాన్ని, చర్యలను అడ్డుకుంటాం, ఈ యథాతధ పరిస్థితి ఇలా కొనసాగడం అమెరికా ఎంత మాత్రమూ సహించలేకపోతోందని మాకు తెలుసు, అయితే మేం ఇంకా మా ప్రయత్నాలు ప్రారంభించలేదు.’’ అని ఆయన చెప్పారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి బీజింగ్‌కు బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటూ ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చైనా విదేశాంగ మంత్రితో ఆయన చర్చలు జరుపుతారు. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ పోస్టు పెట్టింది.
ప్రధాని మోడీ ఖండన
మరోవైపు యుఎఇలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు గాయపడడంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు. ‘పౌరులను, మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు.’ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో యుఎఇకి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తామని చెప్పారు. అన్నిసమస్యలు చర్చలు, సంప్రదింపుల ద్వారానే పరిష్కారమవుతాయని అటువంటి వాటికి భారత్ మద్దతునిస్తుందని చెప్పారు. హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణాకు ఎలాంటి అడ్డంకి, అంతరాయాలు లేకుండా చూడాలన్నారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు ఇదిచాలా కీలకమని పేర్కొన్నారు. ఇరాన్ తమపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపిందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెలిపింది.
మళ్ళీ పొంచి వున్న ముప్పు ?
వాణిజ్య నౌకలు హర్మూజ్‌లో పయనించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మళ్ళీ యుద్ధం పెచ్చరిల్లే ముప్పు పొంచి వుంది. అయితే ట్రంప్ తీసుకునే చర్యలేమిటనేది తెలియరాలేదు. కాగా ఈ ప్రకటనను ఇరాన్ ఖండించింది. హర్మూజ్‌పై తమ పట్టు కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ప్రాంతీయ భద్రతను దెబ్బతీసేలా అమెరికా వ్యవహరిస్తోందని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు విమర్శించారు. ఇందుకు దీటుగా ఇరాన్ వ్యవహరిస్తుందని చెప్పారు. సోమవారం అమెరికాకు చెందిన రెండు వాణిజ్య నౌకలు విజయవంతంగా హర్మూజ్‌ను దాటాయని అమెరికా మిలటరీ ప్రకటించింది. మంగళవారం మరిన్ని నౌకలు దాటతాయా లేదా అనేది చూడాల్సి వుంది.



