కలెక్టరేట్ ఎదుట సుంకెనపల్లి రైతుల నిరసన
రూ.5 వేల నుంచి రూ.65 వేల వరకు
తక్కువగా చెల్లించారని ఆరోపణ
సుమారు రూ.15 లక్షలు స్వాహా చేశారని ఫిర్యాదు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
వరి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, తాము విక్రయించిన ధాన్యానికి రావాల్సిన మొత్తంలో తక్కువగా డబ్బులు జమ చేశారని ఆరోపిస్తూ చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గుండ్రాంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది, రైస్‌మిల్లర్ యాజ మాన్యం కుమ్మక్కై తమను మోసం చేశారని ఆరోపిస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
గుండ్రాంపల్లి పిఎసిఎస్ కేంద్రానికి మే నెలలో సుమారు 70 మందికి పైగా రైతులు విక్రయించిన ధాన్యం బస్తాల వివరాలు, వాటికి సంబంధించిన మొత్తాలను రశీదుల్లో నమోదు చేశారని తెలిపారు. అయితే రశీదుల్లో పేర్కొన్న మొత్తంతో పోలిస్తే రైతుల బ్యాంకు ఖాతాల్లో తక్కువ మొత్తమే జమ చేశారని ఆరోపించారు. ఒక్కో రైతుకు రూ.5 వేల నుంచి రూ.65 వేల వరకు తక్కువగా చెల్లించినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఎందుకు తక్కువగా వచ్చాయని పీఏసీఎస్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని అన్నారు. కొందరు రైతులకు రావాల్సిన డబ్బులు మరో రైతు ఖాతాలో జమయ్యాయని చెబుతున్నారన్నారు.
తమకు రావాల్సిన డబ్బులపై గట్టిగా నిలదీసి అధికారులను ఆశ్రయిస్తామని చెప్పిన ఓ రైతుకు పీఏసీఎస్ సిబ్బందిలో ఒకరు వ్యక్తిగత ఫోన్ నుంచి ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపారన్నారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని సూచించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోరారు.
క్వింటాకు 7 కిలోల తరుగు?
ధాన్యం కొనుగోళ్లలో క్వింటాలుకు ఏడు కిలోల చొప్పున తరుగు తీశారని, పెద్ద మొత్తంలో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు హమాలీలకు క్వింటాలుకు ఒక రేటు చెల్లిస్తూ, రైతుల నుంచి మాత్రం అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గుండ్రాంపల్లి పిఎసిఎస్ కేంద్రంలో సుమారు రూ.15 లక్షల మేర రైతుల సొమ్ము అక్రమంగా దారి మళ్లిందని వాపోయారు. పూర్తి మొత్తాన్ని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులుగా తేలిన పీఏసీఎస్ సిబ్బంది, రైస్‌మిల్లర్ యాజమాన్యంపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు.
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



